ముంబై మునిగింది!

2 Jul, 2019 12:41 IST|Sakshi

ఆర్థిక రాజధాని అతలాకుతలం

స్థంభించిన జన జీవనం

రంగంలోకి సహాయక బృందాలు

మంగళవారం సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి

ముంబై: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్థంభించింది. కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి కూడా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు శిధిలావస్థకు చేరిన భవనాలు కూలుతున్నాయి. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర  ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ఇక చాలా మంది సాయం కోసం ట్విటర్‌ వేదికగా అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం #MumbaiRains అనే ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

తెరుచుకోని స్కూళ్లు..
వర్షం దెబ్బకు ముంబై, థానె, న్యూ ముంబైలోని పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. లోకల్‌ ట్రైన్స్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముందు జాగ్రత్తగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కలికంగా నిలిపివేశారు. 54 విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సహాయక బృందాలు బరిలోకి దిగాయి. జలమయమైన కుర్లాస్‌ క్రాంతినగర్‌లోని సుమారు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గతేడాది వర్షపాతాన్ని ప్రస్తుత వర్షాలు అధిగమించాయిని అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 


ముఖ్యమంత్రి సమీక్ష..
ఎడతెరపిలేని వర్షాలతో మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలపై ఆరా తీసారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. గత రాత్రి ముంబై పోలీసులకు ప్రజల నుంచి సహాయం 1600-1700 ట్వీట్లు వచ్చాయి. వెంటనే వారు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బీఎంసీ, విపత్తు శాఖ అధికారులు గత రాత్రిగా పనిచేస్తూనే ఉన్నారు. మరో రెండు రోజులు ఈ వర్షాలు ఇలానే ఉండవచ్చు. దానికి దగ్గట్లు మేం సిద్దమయ్యాం. రాత్రే పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించాం. పరిస్థితి తీవ్రం కావడంతో ఉదయం ఆఫీసులకు కూడా సెలవును వర్తింపజేశాం. పోలీసు, విపత్తు, బీఎంసీ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఉంది. వర్షాలతో కొన్ని చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మలాద్‌లో గోడ కూలి సుమారు 13 మంది మరణించగా.. 30 నుంచి 40 మంది చనిపోయారు. క్షతగాత్రులను నేను కలిసి పరామర్శించాను. లోకల్‌ ట్రైన్స్‌ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలన్నీ నీటితో మునిగిపోయాయి. రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులు శ్రమిస్తున్నారు.’ అని ఫడ్నవీస్‌ తెలిపారు.

చదవండి : వర్షాలకు 22మంది మృతి

మరిన్ని వార్తలు