అక్కడ చక్రం తిప్పినవారికే..!

16 Oct, 2019 02:42 IST|Sakshi

కేంద్రంలో అధికారం చేపట్టిన వారికే మహారాష్ట్ర పగ్గాలు

అసెంబ్లీపై లోక్‌సభ ఫలితాల ప్రభావం ఎలా ఉందంటే..

సవాళ్ల బాటలో.. 
ఈ సారి ఎన్నికలు అందరికీ గట్టి సవాళ్లే విసురుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ బలం పుంజుకోకపోగా మరికాస్త బలహీనపడింది. కాంగ్రెస్‌ పార్టీని నాయకత్వ లేమి సమస్య వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అగ్రనాయకులు ఎందరో పార్టీలు మారారు. ఎంపీ ఉద్యానరాజే భోస్లే వంటి వారు చేజారిపోయారు. మరఠ్వాడా ప్రాంతంలో ఫిరాయింపుల ప్రభావం ఎక్కువగా చూపించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీనియర్‌ నాయకులు పదవుల్ని వీడడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక ఎన్సీపీ ఈడీ నీడలో ఉంటూ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో ఎందరో నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

ఇక బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో గెలుపు అత్యంత అవసరం. ఎందుకంటే గత ఏడాది జరిగిన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఓటమి పాలైన ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. కానీ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుంది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాలు, ప్రాధాన్యాలు వేరు కావడంతో ఆ పార్టీ కూడా ఒక మెట్టు దిగి శివసేనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక శివసేనకు ఇవి చారిత్రాత్మక ఎన్నికలు. ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. కొన్నాళ్లుగా నేరుగా ప్రధాని మోదీపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శివసేన ఈ సారి క్షేత్రస్థాయిలో బలపడి సీట్లు పెంచుకోవాలని తహతహలాడుతోంది. అందుకే ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో దిగినట్టుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రైతు సమస్యలు, ఆర్థిక మందగమనం, వరదలు వంటి పరిస్థితులు నెలకొన్న వేళ బీజేపీ శివసేన కూటమి తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కశ్మీర్‌ 370 రద్దుపైనే అధికంగా దృష్టి సారించారు. పదే పదే దానిపైన విపక్ష పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. రాహుల్‌ గాంధీ ఇంకా రఫేల్‌ అంశాన్నే పట్టుకొని వేళ్లాడుతున్నారు. విపక్షాల బలహీనతే ఈ సారి బీజేపీ కూటమికి వరంగా మారుతుందని రెండు చోట్లా ఒకటే ప్రభుత్వం అన్న సంప్రదాయం కొనసాగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

మహారాష్ట్రలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ–శివసేన, కాంగ్రెస్‌–ఎన్సీపీ మధ్యే పోటీ నెలకొని ఉంది. గత 20 ఏళ్లుగా ఈ రెండు కూటముల మధ్యే రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు కూటములు అధికారాన్ని అనుభవించాయి. ప్రతీసారి లోక్‌సభ ఎన్నికలు జరిగిన అయిదారు నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సార్వత్రిక ఎన్నికల ప్రభావం వీటి మీద తప్పనిసరిగా పడుతోంది. 1999 నుంచి గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఓటర్లు కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీకే తిరిగి అందలం ఎక్కిస్తున్నారు.

అంతకు ముందు 1990–91, 1995–96లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి కానీ, ఆ తర్వాత నుంచి ఓటర్లు రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, 1993 ముంబై పేలుళ్ల తర్వాత మహారాష్ట్రలో హిందూత్వ వాదులు బలపడ్డారు. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ సేన కూటమి ఎదిగింది. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైతే, మహారాష్ట్రలో తిరిగి కాంగ్రెస్‌ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. 2009లో కేంద్రంలో యూపీఏ–2 ఏర్పాటైతే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్సీపీ అధికారాన్ని దక్కించుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా బీజేపీ, శివసేన పోటీ చేశాయి. కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన రెండూ విడివిడిగా పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్నాయి.

మరిన్ని వార్తలు