జిన్‌పింగ్‌కు ‘దంగల్‌’ నచ్చింది

16 Oct, 2019 02:51 IST|Sakshi

మహాబలిపురం భేటీలో ఆ సినిమా చూశానని నాతో చెప్పారు

ఈ రాష్ట్ర యువతులు దేశానికి గర్వకారణంగా నిలిచారు

హరియాణాలో ప్రధాని మోదీ

చర్ఖిదాద్రి (హరియాణా): చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘దంగల్‌’ను చూశారని, ఆ సినిమా ఆయనకెంతో నచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గతవారం మహాబలిపురంలోని సముద్రతీరంలో ఇరువురు నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటున్న సమయంలో.. ఈ విషయాన్ని జిన్‌పింగ్‌ ప్రస్తావించారని మోదీ వివరించారు. మహిళలు ఏదైనా సాధించగలరని సినిమాలో బాగా చూపారని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారన్నారు. జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు తనకెంతో సంతోషాన్నిచ్చాయన్నారు.

కుస్తీయోధులు బబిత, గీతలను ఆయన తండ్రి మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ ప్రపంచస్థాయి రెజ్లర్లుగా తీర్చిదిద్దే క్రమాన్ని దంగల్‌ సినిమాలో చిత్రీకరించారు. బాలీవుడ్‌ స్టార్‌హీరో ఆమిర్‌ఖాన్‌ మహావీర్‌ సింగ్‌ పాత్రలో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. హరియాణాలోని చర్ఖిదాద్రి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున బబిత ఫొగాట్‌ పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ప్రచారంలో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. దంగల్‌ సినిమాలో హరియాణ్వి యాసలో ‘మన ఆడపిల్లలేమైనా మగపిల్లల కన్నా తక్కువా?’ అన్న డైలాగ్‌ను సైతం మోదీ గుర్తు చేశారు.

ఈ రాష్ట్ర యువతులు దేశానికి గర్వకారణంగా నిలిచారన్నారు. హరియాణా గ్రామాల సహకారం లేకుండా తన ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ విజయవంతం కాకపోయేదన్నారు. మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవం, భద్రత తన ప్రభుత్వ ప్రాధామ్యాలని మోదీ స్పష్టం చేశారు. దేశానికి, సమాజానికి, తమ కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్న మహిళలకు రాబోయే దీపావళి పండుగను అంకితమివ్వాలని మోదీ పిలుపునిచ్చారు. బబిత ఫొగాట్‌కు వ్యతిరేకంగా సీనియర్‌ నేతలు నిర్పేందర్‌ సింగ్‌ సంగ్వాన్‌(కాంగ్రెస్‌), సత్పాల్‌ సంగ్వాన్‌(జననాయక్‌ జనతాపార్టీ) బరిలో ఉన్నారు.

ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం 
‘మోదీని తిట్టాలనుకుంటే ఎంతైనా తిట్టండి. అవసరమైతే థాయ్‌లాండ్, వియత్నాం.. ఎక్కడి నుంచైనా మరిన్ని తిట్లను అరువు తెచ్చుకోండి. నాకేం బాధ లేదు. కానీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్‌కు వెన్నుపోటు పొడవాలనుకోకండి’ అని మోదీ విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానిం చారు. ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని, అలాంటి కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించి శిక్షించాలని హరియాణా ఓటర్లకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేస్తూ ఈ ఆగస్ట్‌ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చర్ఖిదాద్రి, థానేసర్‌ల్లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు