సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: మమతా బెనర్జీ

20 Jan, 2020 22:15 IST|Sakshi

కో​ల్‌కతావివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పేర్కొన్నారు. కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. కాగా తమ రాష్ట్రంలో కూడా త్వరలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేస్తామని ఆమె వెల్లడించారు. సీఏఏ ఇప్పుడు బిల్లు కాదని, చట్టమని.. కావున దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 

సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ అంశాలపై చర్చించడానికి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మమతా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాలపై చర్చించడానికి ఆసక్తి చూపిస్తే తప్పకుండా కో​ల్‌కతాలో సమావేశం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఎన్‌పీఆర్‌లో చాలా అంశాలు ఎన్‌ఆర్‌సీకి అనుకూలంగా ముడిపడి ఉన్నాయని.. ఎన్‌పీఆర్‌పై నిర్ణయం తీసుకునే ముందు ఈశాన్య రాష్ట్రల ముఖ్యమంత్రులు ఎన్‌పీఆర్‌ను క్షుణంగా పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మమతా జవవరి 24 వరకు సీఏఏకు వ్యతిరేకంగా డార్జిలింగ్‌లో చేపట్టనున్న పలు ర్యాలీల్లో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు