రగులుతున్న మరాఠాల ఎద

10 Aug, 2018 16:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ముంబై నగరానికి మూడున్నర లక్షల మందితో మహా ర్యాలీని మరాఠాలు నిర్వహించి ఏడాది గడిచింది. 2019, ఆగస్టు 9వ తేదీన మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ప్రారంభమైన 58 మౌన, అహింసా ర్యాలీలు ముంబై నగరంలో మిళితమై అది మెఘా ర్యాలీగా  మారింది. నాడు ఒక్క రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా రైతులకు పలు రాయితీలు కల్పించాలని, 2016లో 15 ఏళ్ల మరాఠా బాలికపై జరిగిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో సత్వర న్యాయం జరగాలని నాడు మరాఠాలు డిమాండ్‌ చేశారు.

అత్యాచారం కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2017, నవంబర్‌లో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధించింది. లక్షలాది మంది మరాఠాలు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఈ రేప్‌ సంఘటన. ఈ సంఘటనలో దోషులు దళితులవడం వల్ల రిజర్వేషన్లతో వారు విర్రవీగుతున్నారన్న ఆక్రోశంతో మరాఠాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాల మాఫీకి చర్యలు చేపట్టింది.

50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీం కోర్టు నిర్దేశించిన నేపథ్యంలో అప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతం దాటడంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అయినప్పటికీ రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో మరాఠాలు తమ పోరాటానికి విరామం కల్పించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ముంబై హైకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్డు మార్గదర్శకాల మేరకు హైకోర్టు కూడా రిజర్వేషన్ల విషయమై ఏం చేయక పోవచ్చు. అయినప్పటికీ కోర్టు తీర్పు కోసం నిరీక్షిద్దామని, నవంబర్‌ నెల వరకు నిరీక్షించాల్సిందిగా మరాఠాలకు ఫడ్నవీస్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఎందుకోగానీ గత జూలై నెలలో మరాఠాలు రిజర్వేషన్లంటూ రెండో పర్యాయం రోడ్డుమీదకు వచ్చారు. గతంలోలాగా కాకుండా వారు ఈసారి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు. తాజాపోరులో భాగంగా 500 మంది మరాఠాలు గురువారం నాడు ముంబైలోని బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని సబర్బన్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు బైఠాయింపు ప్రారంభించారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేసి ఏం లాభం అంటూ మీడియా కొందరిని ప్రశ్నించగా, తామేమి 50 శాతం మించి రిజర్వేషన్లు ఇమ్మని డిమాండ్‌ చేయడం లేమని, 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఇమ్మని కోరుతున్నామని వారు అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గిస్తే తమకు రిజర్వేషన్లు కల్పించవచ్చని వారు సూచిస్తున్నారు. మీడియా మాట్లాడించిన వారిలో 57 దత్తాత్రేయ్‌ థామ్‌కర్‌ ఒకరు. తన ఇద్దరి కూతుళ్లు ఇంజనీరింగ్‌ చదవుతున్నారని, వారి చదవుల కోసం రెండేళ్ల క్రితం 9 లక్షల రూపాయలు అప్పుచేశానని చెప్పారు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఆ అప్పును ఎలా తీర్చాలో కూడా ప్రస్తుతానికి తనకు తెలియదని అన్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని అన్నారు.

ఇదివరకు జౌళి మిల్లులో పనిచేసిన థామ్‌కర్‌ అది మూత పడడంతో రోజు కూలీగా మారారు. మరాఠాల సంప్రదాయం ప్రకారం మరాఠా మహిళలు భైఠాయింపునకు ముందు వరుసలో ప్రత్యేకంగా కూర్చున్నారు. వారిలో 45 ఏళ్ల ప్రేర్నా రాణె మీడియాతో మాట్లాడుతూ ‘నా పిల్లల చదువు పూర్తయింది. వచ్చేతరం పిల్లల రిజర్వేషన్ల కోసం పోరాటంలో పాల్గొంటున్నాను. మా సమాన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని అక్కడ బైఠాయించిన మరాఠాలందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

చదవండి:
మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు