లాక్‌డౌన్‌: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!

15 Apr, 2020 06:44 IST|Sakshi
బాంద్రాలో పెద్దసంఖ్యలో గుమికూడిన వలస కూలీలను చెదరగొడుతున్న పోలీసులు

సాక్షి, ముంబై: లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేని వలసకూలీలు ఆంక్షలను ధిక్కరించి ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ వందలాదిగా రోడ్డెక్కారు. పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మహానగరం ముంబైలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు వేల సంఖ్యలో పటేల్‌ నగరీ ప్రాంత మురికివాడల్లోని అద్దె ఇళ్లలో ఉంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారంతా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనులు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహారం, నిత్యావసరాలను అందజేశాయి. కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందని భావించిన వారంతా గుంపులుగుంపులుగా మంగళవారం ఉదయం నుంచి బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఇంతలోనే లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సుమారు వెయ్యి మంది వలస కూలీలు రైల్వే స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం అందజేసే ఆహారం, నిత్యావసరాలు తమకు అక్కర్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసదుల్లా షేక్‌ మాట్లాడుతూ.. సంపాదన లేకపోవడంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందనీ, దయచేసి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వేడుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాదాపు రెండు గంటల అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ పరిణామంపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తుందని వలసకూలీలు భావించారనీ, ప్రధాని ప్రకటనతో వారంతా అసంతృప్తికి గురయ్యారని అన్నారు. వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, రాష్ట్రాల సరిహద్దులు మూసివేసి ఉంటాయని అనిల్‌ స్పష్టంచేశారు. వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ మేరకు హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారని వెల్లడించారు.  
సీఎంకు అమిత్‌ షా ఫోన్‌
ముంబైలో పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే వందలాదిగా జనం గుమికూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.  ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.  బాంద్రాలో ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రమే కారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు.

మరిన్ని వార్తలు