ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ

29 Nov, 2019 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కొరత లేదని,  రైతులకు సరఫరా చేయడానికి తగినంత యూరియా సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. 2017-18లో రాష్ట్రంలో 15.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా.. 14.09 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. 2018-19లో 16.70 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా 14.18 లక్షల మెట్రిక్‌ టన్నుల విక్రయాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.

2019-20లో 17.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. పంటల సీజన్‌ ఆరంభం కావడానికి ముందు వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఆ సీజన్‌లో ఏ రాష్ట్రంలో ఎంత మేర యూరియా, ఎరువుల అవసరం ఉంటుందో అంచనాలను సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. ఈ అంచనాలు పూర్తయిన తర్వాత నెలవారీ ఎరువుల అవసరాన్ని కూడా అంచనా వేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. తయారు చేసిన అంచనాల ప్రకారం ఆయా రాష్ట్రాలకు దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులు, దిగుమతి చేసుకునే ఎరువులను సరఫరా చేయనున్నట్లు సదానంద గౌడ తెలిపారు.

మరిన్ని వార్తలు