‘క్యారెట్‌లు తినండి..మ్యూజిక్‌ వినండి’

3 Nov, 2019 19:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాలుష్యం అత్యంత ప్రమాదకరస్ధాయికి చేరడంతో దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతుంటే కేంద్ర మంత్రులు చేసిన ట్వీట్లు ఆన్‌లైన్‌లో పలు విమర్శలకు తావిచ్చాయి. కాలుష్యం కాటేస్తున్న తరుణంలో ఉపశమనం పొందేందుకు వీరిచ్చిన సలహాలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఢిల్లీ వాసులు సంగీతం ఆస్వాదిస్తూ సేదతీరాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ట్వీట్‌ చేయగా, క్యారెట్‌లు తిని కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలను తప్పించుకోండని వైద్యారోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష్‌వర్ధన్‌ ట్వీట్‌ చేశారు. సంగీతంతో మీ రోజును ప్రారంభించాలంటూ సూచించిన ప్రకాష్‌ జవదేకర్‌ వీణ నిపుణులు ఈమని శంకర్‌ శాస్త్రి కంపోజిషన్‌తో కూడిన యూట్యూబ్‌ లింక్‌ను పోస్ట్‌ చేశారు. ఇక విటమిన్‌ ఏ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే క్యారెట్లను తింటే కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తంటూ మరో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్ష్‌వర్థన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఉత్తరాది అంతటా కాలుష్యంతో హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే పర్యావరణ మంత్రి ఎలాంటి సలహాలిస్తున్నారో చూడండి అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. తాజా గాలిని పీల్చుతూ రోజును ప్రారంభించాలని, సంగీతంతో కాదని మరి కొందరు నెటిజన్లు మంత్రుల సలహాలపై మండిపడ్డారు.

మరిన్ని వార్తలు