మొబైల్స్, సిగరెట్లు ప్రియం

2 Feb, 2017 06:24 IST|Sakshi
మొబైల్స్, సిగరెట్లు ప్రియం

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడేవారికి ఇది చేదువార్తే. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ బడ్జెట్‌లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచారు. మొబైల్‌ ఫోన్లు, ఎల్‌ఈడీ బల్బుల ధరలకూ రెక్కులు రానున్నాయి. మొబైల్స్‌లో వాడే పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్‌క్యూట్‌ బోర్డు (పీసీబీ)లు, ఎల్‌ఈడీ బల్బుల విడి భాగాల దిగుమతిపై సుంకం భారీగా పెంచడం వల్ల ఇవి ప్రియం కానున్నాయి. మరోవైపు జైట్లీ... సహజసిద్ధ ఇంధన వనరుల వినియోగంపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీస్‌ చార్జీలను ఎత్తివేశారు.

ఆర్‌ఓ వాటర్‌ ప్యూరిఫయర్స్‌లో ఉపయోగించే ఫిల్టర్లపై కస్టమ్స్‌ డ్యూటీని 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అలాగే దేశీయ ఆర్‌ఓ ఫిల్టర్లను ప్రోత్సహించేందుకు దిగుమతులపై పన్నును 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. తోళ్ల పరిశ్రమకు ఊతమిచ్చేలా వీటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలపై 7.5 శాతం ఉన్న పన్నును 2.5 శాతానికి తగ్గించారు. రక్షణ రంగంలోని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకాలపైనున్న 14 శాతం సేవా పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.

భారీగా పెరిగిన ఎక్సైజ్‌ సుంకం...
ముడి పొగాకుపై 4.2 శాతం నుంచి ఏకంగా 8.3 శాతానికి... పాన్‌ మసాలాలపై 6 శాతం నుంచి 9 శాతానికి ఎక్సైజ్‌ సుంకాలు పెంచారు. ఇక ఖైనీ, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని 6 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించారు. చేతితో తయారుచేసే కాగితం చుట్టిన బీడీలపై ఎక్సైజ్‌ పన్నును వెయ్యికి రూ.21 నుంచి రూ.28 చేశారు. అలాగే దిగుమతి చేసుకున్న రోస్టెడ్, సాల్టెడ్‌ జీడిపప్పుపై సుంకాన్ని 30 శాతం నుంచి 45 శాతానికి పెంచారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో దిగుమతి చేసుకునే వెండి నాణేలు, పతకాలు, వస్తువులపై కొత్తగా 12.5 శాతం సీవీడీ విధించారు.

ఇవి ఖరీదు...
► మొబైల్‌ ఫోన్లు
► సిగరెట్, సిగార్, బీడీలు, ఖైనీ, పాన్‌ మసాలాలు
► దిగుమతి చేసుకున్న జీడిపప్పు (రోస్టెడ్, సాల్టెడ్‌)
► ఎల్‌ఈడీ బల్బులు, దిగుమతి చేసుకున్న వెండి నాణేలు, పతకాలు, వస్తువులు
► ముడి అల్యూమినియం
► ఆప్టికల్‌ ఫైబర్స్‌ తయారీలో ఉపయోగించే పాలిమర్‌ పూత కలిగిన ఎంఎస్‌ టేపులు

ఇవి చౌక
► ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్, గృహావసరాలకు వినియోగించే ఆర్‌ఓ వాటర్‌ ప్యూరిఫయర్లు
► సోలార్‌ ప్యానెల్‌లో ఉపయోగించే గాజు
► ఇంధన ఆధారిత విద్యుత్‌ ఉత్పాదక వ్యవస్థ
► గాలిమర ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే జనరేటర్లు
► తోలు ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలు, స్వైపింగ్‌ మెషీన్లు, వేలిముద్రను చదివే పరికరాలు  రక్షణ రంగంలోని వారికి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌

మరిన్ని వార్తలు