పిల్లలకి పోన్లు ఇచ్చి మీ పనుల్లో బిజీగా ఉంటున్నారా? అంతే సంగతులు!

14 Sep, 2023 09:23 IST|Sakshi

‘స్విగ్గి, జొమాటోల ఫుడ్డు తెప్పించి చేతులు దులుపుకోవద్దు. పిల్లల్ని అమ్మ చేతి రుచికరమైన వంట తిననివ్వండి’ అని కేరళ హైకోర్టు హితవు పలికింది. ఒక మొబైల్‌ ఫోన్‌ కేసులో బుధవారం తీర్పు వెలువరిస్తూ ‘సాయంత్రం ఆడుకుని వచ్చిన పిల్లలు ఇంట్లో వంట ఘుమఘులకు ఉత్సాహపడాలి. అన్నం అడగాలి. అలాంటి స్థితి నేడు ఉన్నదా?’ అని ప్రశ్నించింది. పిల్లల పెంపకంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.కాని, పిల్లల ఆటలు, ఆహారం విషయంలో కేరళ హైకోర్టు హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. 

‘మైనర్‌ పిల్లల చేతికి తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు ఇచ్చి వారిని సంతోషపెట్టవద్దు. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వారు ఏం చూస్తున్నారో పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఇంటి పనులో సొంత పనులో చేసుకోవద్దు. పిల్లలు సెల్‌ఫోన్లలో చూడకూడనివి చూస్తే వాటి దుష్ఫలితాలు సుదీర్ఘకాలం ఉంటాయి’ అని కేరళ హైకోర్టు బుధవారం తల్లిదండ్రులకు హితవు చెప్పింది.

కేరళలోని అలవు ప్రాంతంలో ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు చూస్తున్నాడని పోలీసులు పెట్టిన కేసును కొట్టి వేస్తూ (ఐపిసి సెక్షన్‌ 292 చెల్లదని) జస్టిస్‌ కున్హి కృష్ణన్‌ తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ల గురించి హెచ్చరించారు. ‘పిల్లలు సెల్‌ఫోన్లలో విజ్ఞాన, వినోదానికి సంబంధించి వీడియోలు చూడాలి... అదీ తల్లిదండ్రుల సమక్షంలో. తల్లిదండ్రుల అజమాయిషీ లేకుండా వారు మొబైల్‌ చూడకూడదు. పిల్లలు ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలి. వారిని ఫుట్‌బాలో, క్రికెట్టో ఆడేలా చేయండి. శారీరకంగా దృఢంగా ఎదిగేలా చేసి దేశ భవిష్యత్తు కోసం ఆశ పెట్టుకునేలా తీర్చిదిద్దండి’ అని కున్హి కృష్ణన్‌ అన్నారు.

తల్లి చేసేదే రుచికరం
అదే సమయంలో పిల్లల ఆహారం గురించి ఇటీవల వచ్చిన మార్పును కూడా జస్టిస్‌ వ్యాఖ్యానించారు. ‘పిల్లలకు స్విగ్గి, జొమాటోల నుంచి ఆహారం తెప్పించి ఇస్తున్నారు. కాని పిల్లలు తల్లి చేసిన రుచికరమైన తిండినే తినాలి. పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి ఇంట్లో వంట ఘుమఘుమలు మొదలయ్యే సమయానికి చేరుకుని అన్నం కోసం ఎదురు చూడాలి. అలా జరిగితే ఎంత బాగుంటుంది? మేం చెప్పాల్సింది చెప్పాం. ఇక తల్లిదండ్రుల విచక్షణ’ అని కున్హి కృష్ణన్‌ అన్నారు.

మేధో ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం
కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు స్థూలంగా నేటి పిల్లల పెంపకాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. పరిశీలించి చూస్తే అవి పిల్లల మేధో, భౌతిక ఆరోగ్యం గురించి హెచ్చరిక చేస్తున్నాయి. ఇవాళ రేపు స్కూళ్లు, తల్లిదండ్రులు పిల్లల శారీరక వ్యాయామానికి వీలు ఇవ్వడం లేదు. ఆటలాడమని ప్రోత్సహించడం లేదు. ఆడుకునే వీలు కూడా కల్పించడం లేదు. దాంతో పిల్లలు కదలికలు మందగించి బద్దకం, స్థూలకాయం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. మరోవైపు ఆ సమయాన్ని సెల్‌ఫోన్లలో అనవసరమైన విషయాలు చూస్తూ బుర్ర పాడుచేసుకుంటున్నారు. ఫిల్టర్లు పెడితే తప్ప సెల్‌ఫోన్లలో పోర్నోగ్రఫీ, వయొలెంట్‌ వీడియోలు మీట దూరంలో ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో వాటిని గంటల కొద్ది చూస్తే తీవ్ర మానసిక ప్రభావాలకు లోనవుతారు.

జరగవలసిన నష్టం జరిగే వరకు తల్లిదండ్రులకు విషయం తెలియడం లేదు. ఇంకోవైపు వంటకు సమయం లేకనో లేదా పిల్లలు అడుగుతున్నారనో చీటికి మాటికి స్విగ్గీలో టిఫిన్లు, భోజనాలు తెప్పించే తల్లిదండ్రులు పెరిగారు. హోటల్‌ తిండి పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. ఒకప్పుడు ఎప్పుడో తప్ప బయటి తిండి తిననివారు ఇవాళ ప్రతి రెండో రోజు ఏదో ఒకటి తెప్పిస్తున్నారు. తల్లి చేసే ఒకటి రెండు కూరలైనా ఎంతో శుచిగా, రుచిగా ఉంటాయి. వంట పని భారం కాకుండా భర్త, పిల్లలు సాయం చేస్తే శుభ్రమైన ఇంటి భోజనం చేయవచ్చు. కలిసి కూచుని భోంచేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

(చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..)


  

మరిన్ని వార్తలు