'విదేశాల్లో భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారు'

20 May, 2015 15:37 IST|Sakshi

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. విదేశీ పర్యటనల్లో మోదీ దేశ అంతర్గత సమస్యలను ప్రస్తావిస్తూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ విమర్శించారు. మోదీలాగా గతంలో ఏ ప్రధానీ విదేశ గడ్డపై భారత అంతర్గత విషయాలను ప్రస్తావించలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అయితే గతంలో ఏ ప్రధాని కూడా విదేశీ గడ్డపై దేశ అంతర్గత రాజకీయాలను ప్రస్తావించలేదని షకీల్ అహ్మద్ పేర్కొన్నారు.

 విదేశీ పర్యటనల్లో ప్రధాని ఏ పార్టీకీ, మతానికీ, సమూహానికి ప్రతినిధిలా వ్యవహరించరని వ్యాఖ్యానించారు. విదేశీ గడ్డపై భారత అంతర్గత రాజకీయాల గురించి మోదీ మాట్లాడరాదని షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లంచం తీసుకున్న విషయాన్ని యావత్తు దేశం చూసిందని, ప్రత్యర్థి పార్టీ నాయకులు ఈ విషయాన్ని ఎవరైనా విదేశాల్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు