‘సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితుడికి అందలం’

3 Jan, 2019 18:07 IST|Sakshi

చండీగఢ్‌ : మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌ నాథ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతను కాంగ్రెస్‌ సీఎంను చేసిందని పరోక్షంగా కమల్‌ నాథ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ పట్ల పంజాబ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌కు న్యాయస్ధానం ఇటీవల జీవిత ఖైదు విధించడాన్ని ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబ సూచనలతో ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఫైళ్లను సమాధి చేశారని, ఎన్డీఏ ప్రభుత్వం ఆయా కేసులను తిరగదోడిందని చెప్పారు.

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్‌ అన్ని ప్రయత్నాలూ చేసిందని ఆరోపించారు. గతంలో గరీబీ హఠావో నినాదంతో హడావిడి చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు రైతు రుణాల మాఫీ పేరుతో లాలీపాప్‌ స్కీమ్‌లతో ముందుకొస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో రుణ మాఫీ హామీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు