55 ఏళ్లు దాటిన పోలీసులు ఇంటి వద్దే ఉండొచ్చు..

28 Apr, 2020 12:40 IST|Sakshi

ముంబై : నగరంలో విధులు నిర్వరిస్తున్న 55 ఏళ్లు పైబడిన పోలీసులు ఇకపై ఇంటి వద్దే ఉండొచ్చని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ తెలిపారు. రెండోదశ లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు నగరంలోని 94 పోలీసు స్టేషన్‌లకు అధికారిక సమాచారం అందజేశారు. అలాగే 50 ఏళ్లు పైబడి హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ లాంటి జబ్బులు ఉన్నవారు.. సెలవు తీసుకునే అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ 55 ఏళ్లు పైబడివారు ఎవరైనా విధులు నిర్వహించడానికి వస్తే.. బయటి ప్రదేశాల్లో డ్యూటీ వేయకూడదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అలా చేస్తే వారు వైరస్‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. 

కాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా వేగంగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు పోలీసులు కూడా కరోనా సోకడంతో మృతిచెందారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన సూచనల్లో 55 ఏళ్లు పైబడినవారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ముంబైలో 5,500కు పైగా కరోనా కేసులు నమోదుకాగా, 219 మంది మృతిచెందారు.

చదవండి : ముంబై పోలీసుల‌కు అక్ష‌య్ విరాళం

మరిన్ని వార్తలు