టోకెన్‌ పోతే వడ్డింపే

28 Nov, 2017 10:53 IST|Sakshi

మెట్రో స్టేషన్లలో టోకెన్‌ మిస్సింగ్‌లపై గట్టి చర్యలు

తమతో తీసుకెళ్తున్న కొందరు తుంటరిలు

రూ.50 నుంచి 500కు జరిమానా పెంపు

మెట్రో రైల్‌ ప్రయాణిలకు ముఖ్య గమనిక. స్టేషన్లలో ఇచ్చే టోకెన్లను ఇకనుంచి జాగ్రత్తగా ఉంచుకోండి. దానిని పోగొట్టుకుంటే భారీగా జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కొందరు చేసే పోకిరి పనుల వల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.

సాక్షి, బెంగళూరు: కొంతకాలంగా మెట్రోరైల్వే స్టేషన్లలో టికెట్ల సందర్భంగా ఇచ్చే టోకెన్లను తస్కరిస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో దీనిని అరికట్టడానికి మెట్రో సంస్థ (బీఎంఆర్‌సీఎల్‌).. టోకెన్లను పోగొట్టుకున్న వారికి జరిమానాను పెంచింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో కొందరు తుంటరిలు మెట్రో టోకెన్లను కొనుగోలు చేసి, అసలు ప్రయాణమే చేయకుండా వాటిని జేబులో వేసుకుని వెళ్తుంటారు. మైక్రోచిప్‌ కలిగిన ఈ టోకెన్లను తయారు చేయడానికి ఒక్కొక్క టోకెన్‌కు రూ.35 ఖర్చవుతుండగా, పొరపాటున టోకెన్‌ను పోగొట్టుకుంటే రూ.50 జరిమానా విధించేవారు. దీంతో టోకెన్ల తమవద్ద ఉన్నా కూడా కొంతమంది పోగొట్టుకున్నామంటూ రూ.50 జరిమానా చెల్లించి వాటిని తీసుకెళ్లేవారు. దీంతో ఇప్పటి వరకు 1,500 టోకెన్లు తస్కరణకు గురికావడంతో ఆ విషయాన్ని గుర్తించిన బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు జరిమానాను రూ.50 నుంచి రూ.500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దొడ్డిదారిలో వెళ్తూ తస్కరణ
మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించగానే మార్గాన్ని బట్టి ప్రయాణికులకు సిబ్బంది టోకెన్లను ఇస్తారు. తమ స్టేషన్‌ రాగానే బయటకు వెళ్లే ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఆ టోకెన్‌ను వేస్తే ద్వారం తెరచుకుని బయటకు వెళ్లగలరు. కొంతమంది టోకెన్లను కొట్టేయడానికి సాధారణ ద్వారం నుంచి కాకుండా మరో మార్గం ద్వారా బయటకు వెళ్లడం తెలుసుకున్నారు. ఒకవేళ తనిఖీల్లో దొరికితే రూ.200 వరకు జరిమానా తప్పదు. అయినప్పటికీ మెట్రో టోకెన్ల మిస్సింగ్‌ ఘటనలు ఆగకపోవడంతో మెట్రో టోకెన్లు పోతే విధించే జరిమానాను భారీగా పెంచడం విశేషం. దీంతో పాటు టోకెన్లు పోగొట్టుకున్న వ్యక్తులు మెట్రోలో గరిష్ట టికెట్‌ ధర రూ.60 చెల్లించి మరో టోకెన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. 

పెంపు అందుకే
‘టోకన్లు తీసుకొని ప్రయాణించిన అనంతరం తాము దిగాల్సిన స్టేషన్‌ రాగానే టోకన్లు తిరిగి అప్పగించకుండా తమతోపాటే తీసుకెళుతున్న ఘటనలో అనేకం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది.వీటిని నివారించడానికే జరిమానాను భారీగా పెంచడానికి నిర్ణయించుకున్నాం. దీంతోపాటు బయటకు వెళ్లే ద్వారాల వద్ద డిటెక్టర్లను ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం’.
–ప్రదీప్‌సింగ్‌ ఖరోలా, బీఎంఆర్‌సీఎల్‌ ఎండీ.

మరిన్ని వార్తలు