నువ్వేం ఏం చేయగలవు;బ్యాడ్జీలు పంచుతా!

17 Sep, 2019 11:06 IST|Sakshi

ది మ్యాన్‌ ఆఫ్‌ మూమెంట్‌: నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక కాలం అధికార పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్‌ పార్టీ... సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలపడిన విషయం తెలిసిందే. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు కాంగ్రెస్‌ పరాజయానికి సమర్థుడైన నాయకుడు లేకపోవడమని కొందరు అంటే... ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజే కాంగ్రెస్‌ను పతనం చేసిందని మరికొందరు విశ్లేషించారు. ఇక నరేంద్ర మోదీ పేరుతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అనే మరోమాట తరచుగా వినిపిస్తుంది. ఆరేళ్ల వయసులో బాలస్వయంసేవక్‌గా సేవలు అందించిన మోదీ ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం వాలంటీర్‌గా పనిచేశారట.

1956లో అప్పటి గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రసిక్‌భాయ్‌ దవే ఆధ్వర్యంలో వాద్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మోదీ కూడా వెళ్లారట. ఫండ్‌ రైజింగ్‌ కోసం తన వంతు సహాయం చేస్తానని చెప్పారట. ఆరేళ్ల మోదీ మాటలకు ఆశ్చర్యపోయిన దవే.. ‘ఇంత చిన్న పిల్లాడివి. రాజకీయ కార్యక్రమంలో నువ్వేం సాయం చేయగలవు’ అని ప్రశ్నించారట. ఇందుకు జవాబుగా తాను కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరికీ బ్యాడ్జిలు పంచడం లేదా అమ్మడం ద్వారా నిధులు సేకరిస్తానని చెప్పారట. ఇందుకు సమ్మతించిన దవే తన కార్యక్రమాల్లో మోదీ తరచుగా పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారట. 

ఈ విషయాలను ‘ది మ్యాన్‌ ఆఫ్‌ మూమెంట్‌: నరేంద్ర మోదీ’ పుస్తక రచయితలు ఎంవీ కామత్‌, కాళింది రందేరి తమ పుస్తకంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో మోదీ బ్యాడ్జీ అమ్మిన మాట వాస్తమేనని వాద్‌నగర్‌కు చెందిన మరో కాంగ్రెస్‌ నేత ద్వారకాదాస్‌ కూడా ధ్రువీకరించారట. అలా చిన్ననాడు దవేతో మోదీకి ఏర్పడిన అనుబంధం ఆరెస్సెస్‌తో పాటు బీజేపీలో కూడా మోదీ కీలక నేతగా ఎదుగుతున్న క్రమంలోనూ కొనసాగిందట. అంతేకాదు దవేను గౌరవించే మోదీ.. తాను చదివిన పాఠశాల గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన సమయంలో దవేతో పాటు ఆయన సతీమణి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారట. 1999లో  బీజేపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా ఉన్న మోదీ..ప్రత్యర్థి పార్టీకి చెందిన దవేతో ప్రేమ పూర్వకంగా పలకరించడంతో ఆయన ఎంతో సంతోషపడ్డారట.

ఈ విషయాన్ని దవే భార్య సర్లాబెన్‌ చెప్పినట్లుగా రచయితలు తమ పుస్తకంలో పేర్కొన్నారు. కాగా 1950లో సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధానిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఈరోజు(మంగళవారం) ఆయన జన్మదినం సందర్భంగా స్వరాష్ట్రానికి చేరుకున్న మోదీ..తొలుత తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు,  అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించనున్నారు.

మరిన్ని వార్తలు