స్వచ్ఛ కోటి

17 Sep, 2019 11:06 IST|Sakshi

రూ.కోటి దాటిన స్పెషల్‌ డ్రైవ్‌ జరిమానాలు   

స్వచ్ఛ ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ విధింపు  

4 నెలల్లోనే ఇంత మొత్తం వసూలు  

సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్‌ అమలులో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ... ప్రజలు, దుకాణదారులు, వివిధ సంస్థల నిర్వాహకుల్లో తగిన మార్పు కనిపించకపోవడంతో జరిమానాల బాట పట్టింది. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల అమలుపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించింది. అయినా ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మే 24 నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు నెలల్లోనే రూ.కోటికి పైగా జరిమానాలు విధించింది. రోడ్లపై, నాలాల్లో చెత్త వేయడం, భవన నిర్మాణ వ్యర్థాలు పారబోయడం, బహిరంగంగా చెత్తను తగలబెట్టడం, బహిరంగ మల, మూత్ర విసర్జన తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ఈ పెనాల్టీలు వేసింది. మొత్తం 8,475 పెనాల్టీల ద్వారా రూ.1,03,31,620 వసూలు చేసింది. 

టాప్‌ 5 సర్కిళ్లు ఇవీ...  
చందానగర్‌లో 518 పెనాల్టీల ద్వారా రూ.16.90 లక్షలు, శేరిలింగంపల్లిలో 312కు గాను రూ.13.90 లక్షలు, ఖైరతాబాద్‌లో 627కు రూ.8.41 లక్షలు, జూబ్లీహిల్స్‌లో 462కు రూ.6.85 లక్షలు, మూసాపేట్‌లో 350కు రూ.5.15 లక్షలు వసూలు చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు