వరద బీభత్సం : పైలట్‌ చాకచక్యం.. తల్లీ బిడ్డ క్షేమం

17 Aug, 2018 19:38 IST|Sakshi

కొచ్చి : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత మే నెల నుంచి  ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. వరద తాకిడి తీవ్రతరమవడంతో 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నేవీ 21 సహాయ, డైవింగ్‌ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ఓ గర్భిణిని రక్షించేందుకు నేవీ హెలికాప్టర్‌ పైలట్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం పలువురి మన్ననలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ అధికారి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

వివరాలు.... సాజితా జబీల్‌ అనే మహిళ కొచ్చి ఎయిర్‌పోర్టు సమీపంలో నివాసం ఉంటున్నారు. నిండు చూలాలైన ఆమెకు శుక్రవారం ఉదయం నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే వారు నివాసం ఉంటున్న ప్రాంతమంతా వరద నీటితో నిండిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు.. నేవీ హెలికాప్టర్‌ ద్వారా ఆమెను సంజీవని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో హెలికాప్టర్‌లోకి ఎక్కించడానికి సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ విజయ్‌ వర్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు