పర్షియన్‌ గల్ఫ్‌లో భారత్‌ చమురు ట్యాంకర్లకు భద్రత

21 Jun, 2019 20:23 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇరాన్‌, అమెరికా సైనిక డాడుల నేపథ్యంలో భారత నేవీ.. పర్షియన్‌ గల్ఫ్‌లోని భారత్‌కు చెందిన ముడి చమురు ట్యాంకర్లకు భద్రత కల్పించనుంది. అమెరికా- ఇరాన్‌ల మధ్య యుద్ధం అనివార్యమైతే తమ చమురు ట్యాంకులకు నష్ట వాటిల్లకుండా చర్యలు చేపట్టింది. చమురు రవాణా నిమిత్తం పర్షియన్‌ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 5 నుంచి 8 చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇవి భారత చమురు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత దేశం సుమారు 63 శాతం ముడి చమురును సౌదీ అరేబియా, ఇరాక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భారత దేశానికి ముడి అందించే దేశాల్లో ​ఇరాన్‌ కూడా చేరింది. ఈ మేరకు పలు ఒప్పందాలు కూడా చేసుకుంది.

కాగా తమ గగనతలంలో ప్రమాదకర అమెరికా డ్రోన్‌ ప్రవేశించినందుకే దానిని కూల్చివేసినట్లు ఇరాన్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘ ఇరాన్‌ తప్పు చేసింది ’ అని ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గతేడాది తమతో అణు ఒప్పందం విరమించుకున్న నాటి నుంచి ఇరాన్‌.. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా దీటుగా సమాధానమిస్తోంది. తాజాగా అగ్రరాజ్య డ్రోన్‌ను కూల్చివేసి సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో అక్కడ నిలిపి ఉంచిన చమురు ట్యాంకర్లకు భద్రత పటిష్టపరిచే విషయమై భారత షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చ జరగనుంది.

మరిన్ని వార్తలు