విధింపు రెట్టింపు...అమలు సున్నా

12 Apr, 2017 02:09 IST|Sakshi
విధింపు రెట్టింపు...అమలు సున్నా

భారత్‌లో ఉరిశిక్షలపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో 2016లో విధించిన ఉరిశిక్షల్లో 81 శాతం పెరుగుదల నమోదైనట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ అధ్యయనంలో తేలింది. 2015లో 75 మందికి ఉరిశిక్ష విధించగా 2016లో భారత్‌లో 136 మందికి ఉరిశిక్ష విధించారని తెలిపింది.  హైజాకింగ్‌కు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలంటూ రూపొందించిన కొత్త హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం వల్లే 2016లో ఉరిశిక్షల సంఖ్య సుమారు రెట్టింపైందని తెలిపింది. 2016లో భారత్‌లో ఉరిశిక్షను అమలుచేయలేదని, ఈ ఏడాది చివరినాటికి సుమారు 400 మందిని ఉరితీయాల్సి ఉందని తెలిపింది.

ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షలు అమలు చేస్తున్నది చైనాలోనే. గతేడాది ప్రపంచంలోని దేశాలన్నీ కలసి అమలు చేసిన మరణశిక్షల కంటే ఎక్కువ మరణశిక్షలను చైనా అమలు చేసింది. గతేడాది ప్రపంచంలోని దేశాలన్నింటిలో కలసి 1,032 మందికి మరణశిక్షలు అమలయ్యాయి. ఒక్క చైనాలోనే ఇంతకంటే ఎక్కువ శిక్షలు అమలైనట్టు ఆమ్నెస్టీ నివేదిక వెల్లడించింది.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా అమలైన మరణశిక్షల్లో 87 శాతం ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్‌లలోనే అమలయ్యాయని పేర్కొంది. అయితే పాక్‌లో 2015లో 326 మరణశిక్షలు అమలవగా 2016లో 87కు తగ్గాయి. ఆ దేశంలో మరణశిక్షల అమలు 73 శాతం తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. అమెరికాలో గతేడాది 20 మరణశిక్షలు అమలైనట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల అమలు సంఖ్యకు సంబంధించి 2015తో పోలిస్తే 2016లో 37 శాతం మేరకు తగ్గుదల నమోదైంది.

మరిన్ని వార్తలు