కనువిందు చేస్తున్న జోగ్‌ జలకళ

15 Aug, 2018 16:17 IST|Sakshi

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన  జోగ్  మరింత ఎగిసిపడుతూ దృశ్యమానంగా కనువిందు చేస్తోంది.  కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరు కిందకి ప్రవహించడంతో జోగ్ జలపాతానికి వరద పోటెత్తింది. 

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. శరావతి నది ఉప్పొంగి ప్రవహించడంతో దేశంలోనే అతిపెద్ద జలపాతం జోగ్ నుంచి నీళ్లు కిందకు దుముకుతుంటే ఆ ప్రాంతంమంతా ఆహ్లాదకరంగా మారింది. లింగనమక్కి డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో సముద్రమట్టానికి 250 మీటర్ల (830 అడుగుల) ఎత్తులో ఉన్న ఈ అద్భుతదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత, పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం   ఇదే మొదటిసారట.

కాగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వరద బీభత్సానికి విలవిల్లాడుతున్న కేరళలో ఇంకా విపత్కర  పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42మంది మృత్యువాత పడ్డారు. పెద్దఎత్తున సహాయ, రక్షకసేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముళ్ల పెరియార్‌ డ్యామ్‌లో నీటిస్థాయి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో పలు జిల్లాల్లో తాజాగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

మరిన్ని వార్తలు