గులాబీ రంగులో ఆకాశం.. నా సిటీ పూర్వస్థితికి!

21 May, 2020 12:34 IST|Sakshi

ఫొటోలు షేర్‌ చేస్తున్న భువనేశ్వర్‌ వాసులు

అతి తీవ్ర రూపం దాల్చిన తుపాను ‘ఉంపన్‌’ పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. గంటకు సుమారు 190 కిమీల వేగంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా బలహీనమైన ఇళ్లు నేలమట్టం కాగా.. పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ సైతం ధ్వంసమైంది. సూపర్‌ సైక్లోన్‌ ధాటికి పశ్చిమ బెంగాల్‌లో 12 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. అయితే ఉంపన్‌ తీవ్రత నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు జాగ్రత్తల చర్యల కారణంగా.. ప్రాణనష్టం తగ్గినా.. ఆస్తినష్టం భారీగానే సంభవించింది. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం)

ఈ నేపథ్యంలో తుపాన్‌ ధాటికి అల్లాడిన ఒడిశా కాస్త తేరుకుందంటూ స్థానికులు ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. వాటిని తట్టుకుని నిలుస్తుందనడానికి నా పట్టణం మరోసారి మంచి ఉదాహరణగా నిలిచింది. తుఫాన్‌ ఉంఫన్‌ శాశ్వతంగా వెళ్లిపోయింది. భువనేశ్వర్‌ పరిసరాల్లో ఆకాశం ఇలా’’అని గులాబీ రంగులో ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబించే ఆకాశం ఫొటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుఫాన్‌ బాధితులకు సంఘీభావం తెలుపుతూ.. వారు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు