భర్త మగాడు కాదంటూ.. విడాకులు!

22 Mar, 2016 12:19 IST|Sakshi
భర్త మగాడు కాదంటూ.. విడాకులు!

సాధారణంగా భారతీయ మహిళలు భర్త నుంచి విడాకులు కావాలంటే కట్నం కోసం వేధిస్తున్నాడనో.. మరేదైనా కారణం చెబుతారు. కానీ పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన ఓ కొత్త పెళ్లి కూతురు మాత్రం తన భర్త మగాడు కాదని, అందువల్ల అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, తాను పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన రూ. 55వేల నగదుతో పాటు రూ. 55 వేల విలువగల ఆస్తులను కూడా తిరిగి ఇప్పించాలని కోరింది. ఈ కేసులో ఆమె విజయం సాధించింది కూడా. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పిలిపించి వాళ్ల సమక్షంలోనే విచారణ జరిపారు.

18 ఏళ్ల యువతికి రెండు వారాల క్రితమే పెళ్లయింది. కొన్నాళ్ల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కొంతమంది అల్లుడి ఇంటికి వెళ్లగా, అప్పుడే వాళ్లలో కొందరికి అతగాడికి పుంసత్వ సమస్య ఉన్నట్లు తెలిసింది. కానీ, పెళ్లికూతురు అప్పటికి ఏమీ చెప్పలేక ఊరుకుంది. పుట్టింటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భోరుమంది. స్ట్రీట్ సర్వైవర్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షబ్నమ్ రామస్వామి వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకొంది. ఇంతకుముందు కూడా తమ గ్రామంలో చాలామంది అమ్మాయిలు విడాకులు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరూ భర్తకు పుంసత్వ సమస్య ఉందని ధైర్యంగా చెప్పలేకపోయారని ఆమె తెలిపింది. తనకు మాత్రం భయం లేదని చెప్పింది. చివరకు కోర్టులో ఆమెకు విడాకులు మంజూరయ్యాయి.

మరిన్ని వార్తలు