భారత అమ్ములపొదిలో ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌

15 Oct, 2017 05:03 IST|Sakshi

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

ఈ నెల 16న రక్షణ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం  

విశాఖ సిటీ: భారత అమ్ములపొదిలో మరో అధునాతన యుద్ధ నౌక చేరింది. సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్‌మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ను ఈ నెల 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రాజెక్టు–28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్‌మెరెన్‌ యుద్దనౌకల్లో ఇది మూడోది.
ఐఎన్‌ఎస్‌ కమోర్తా, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్‌ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ను 1987లో డీ కమిషన్‌ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేసినట్లు నౌకాదళాధికారులు తెలిపారు.  

కిల్తాన్‌ ప్రత్యేకతలు..  
ఐఎన్‌ఎస్‌ కమోర్తా కంటే శక్తిమంతమైనది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్‌ ఫైబర్‌ కాంపొజిట్‌ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. షిప్‌ యార్డ్‌ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌకగా పేరొందింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్‌ మెరైన్‌లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం.

109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ 25 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్‌ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. భారీ టార్పెడోలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్‌ మీడియం రేంజ్‌ తుపాకీలు, క్లోజ్‌ ఇన్‌ వెపన్‌ సిస్టమ్‌ కలిగిన 2 మల్టీ బ్యారెల్‌ తుపాకీలున్న సెన్సార్‌ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మిస్సైల్‌ డెకోయ్‌ రాకెట్లు, ఎలక్ట్రానిక్‌ సపోర్ట్‌ మేజర్‌ వ్యవస్థ, ఎయిర్‌ సర్వైవలెన్స్‌ రాడార్‌ వ్యవస్థతో పాటు ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్‌ కూడా ఇందులో ఉంటుంది.

మరిన్ని వార్తలు