పీఎంవో సమీక్షను జోక్యంలా భావించలేం: నిర్మలా సీతారామన్‌

8 Feb, 2019 16:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంలో రక్షణ శాఖ నిర్ణయాలకు భిన్నంగా ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని, ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందన్నఓ జాతీయ పత్రిక కథనాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. పీఎంవో సమీక్షను జోక్యంగా భావించలేమని అన్నారు. ఇదే నివేదికలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌ ఇచ్చిన వివరణను మీడియా ప్రస్తావించలేదన్నారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో రఫేల్‌ ఒప్పందంపై చర్చలను ప్రస్తావిస్తూ అంతా సజావుగా సాగుతుందని పారికర్‌ స్వదస్తూరితో రాసిన నోట్‌ను మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరించిందన్నారు.

రఫేల్‌పై  పార్లమెంట్‌లో, న్యాయస్ధానాల్లోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, దీనిపై ఇంకా మాట్లాడటం సమయం వృధాయేనని పేర్కొన్నారు. రఫేల్‌పై ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ సమాధానం ఇచ్చిందన్నారు. కాగా రఫేల్‌ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ జాతీయ మీడియా ప్రచురించిన కథనంతో రఫేల్‌ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది.

రఫేల్‌ ఒప్పందం విషయంలో రక్షణశాఖ నిర్ణయాలకు భిన్నంగా పీఎం కార్యాలయం వ్యవహరిస్తూ ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందన్న కథనంతో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విరుచుకుపడ్డారు. రఫేల్‌ డీల్‌లో తన సన్నిహితుడు అనిల్‌ అంబానీకి భాగస్వామ్యం కట్టబెట్టేందుకు చౌకీదార్‌ మోదీ ప్రయత్నించారనేందుకు రక్షణ శాఖ నోట్‌ నిదర్శనమని నిప్పులు చెరిగారు.  

మరిన్ని వార్తలు