ఉమ్మడి జాబితాపై పెత్తనం వద్దు

17 Jul, 2016 03:31 IST|Sakshi
ఉమ్మడి జాబితాపై పెత్తనం వద్దు

అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి
కొత్త చట్టం తెస్తే రాష్ట్రాల సమ్మతి తీసుకోవాలి
రాష్ట్రాలపై అదనపు భారం పడితే కేంద్రమే భరించాలి
రాష్ట్రాల్లో సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలి
తెలంగాణ, ఏపీ మధ్య వివాదాస్పద అంశాలను పరిష్కరించాలి
విభజన చట్టం మేరకు నియోజకవర్గాల సంఖ్య పెంచాలి
నిబంధనల అమలుకు అవసరమైతే చట్ట సవరణ చేయండి
తీవ్ర జ్వరం కారణంగా గంటన్నరపాటే భేటీలో పాల్గొన్న కేసీఆర్
ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివిన సీఎస్

 
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి జాబితాలోని అంశాలపై పెత్తనం ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నలుగుతున్న వివాదాస్పద అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలుకు అవసరమైతే చట్ట సవరణలు చేయాలన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో గంటన్నర పాటు సమావేశంలో పాల్గొని 11.30 గంటలకు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..
 
 - మేం సహకార సమాఖ్య వ్యవస్థ భావనకు మద్దతు పలుకుతున్నాం. రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు కేంద్రం చేయాల్సింది చాలా  ఉంది. నిధుల పంపిణీ విషయంలో, మౌలిక వసతుల ఏర్పాటులో అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది. కేంద్రం రహదారులకు నిధుల కేటాయింపులు పెంచినా.. సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ నీటి పారుదల ప్రాజెక్టును కేటాయించాలి.
 - ఉమ్మడి జాబితాలోని అంశానికి సంబంధించి ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చినప్పుడు, లేదా సవరణలు తెచ్చినప్పుడు రాష్ట్రాల సమ్మతి తీసుకోవాలి. ఒకవేళ సదరు చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడితే దాన్ని కేంద్రం పూర్తిగా తిరిగి చెల్లించాలి. ఉదాహరణకు విద్యాహక్కు చట్టం అమలు చేయడం వల్ల ఒక్క తెలంగాణపైనే ఏటా రూ. 300 కోట్ల భారం పడుతుంది. మోడల్ స్కూళ్ల పథకం కూడా కేంద్రం ప్రవేశపెట్టినా ఇప్పుడు నిధులు ఆపేయడంతో రాష్ట్రాలపై చాలా భారం పడుతోంది. ఏదైనా పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే అందుకు అవసరమయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే భరించాలి.
 - ఉమ్మడి జాబితాల్లోని అంశాల్లో కేంద్రం పెత్తనం చేయడం ఆపాలి. ఉదాహరణకు రాష్ట్రాలు నిరభ్యంతర పత్రం ఇచ్చేంతవరకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదు. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు 356 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు అవి 172కి పరిమితమయ్యాయి. కళాశాలల్లో వసతులు లేనందున వర్సిటీలు అనుబంధ హోదాను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం.
 - కేంద్రం యూజీసీ బడ్జెట్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 65 శాతం కేటాయించి, వందలాదిగా ఉన్న రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు కేవలం 35 శాతం నిధులను కేటాయిస్తోంది.
 - రాష్ట్రాల గవర్నర్లను నియమించేటప్పుడు రాష్ట్రాలను కూడా సంప్రదించాలన్న సిఫారసుకు మేం మద్దతు పలుకుతున్నాం. అలాగే గవర్నర్‌ను వర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉంచరాదు. గవర్నర్లకు రాజ్యాంగబద్ధమైన విధులు చాలా ఉన్నందున ఇది సరికాదు. తెలంగాణలో ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం.
 - ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలి. అలాగే ఏపీలోనూ పెంచాలి. కేంద్రం దీని అమలుకు అవసరమైతే జోక్యం చేసుకుని తగిన చట్ట సవరణలు చేయాలి.
 - రాష్ట్రాలు తమ వనరుల సమీకరణకు వీలుగా కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సడలించాలి.
 - స్థానిక సంస్థలకు నిధులను నేరుగా ఇవ్వకుండా రాష్ట్రాల ద్వారా ఇవ్వాలి. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లకు నిధుల్లేవు. ఎందుకంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తోంది. ఈ కారణంగా జిల్లా స్థాయి లో ప్రణాళికలు చేయడంలో సమస్యలు వస్తాయి.
 - ఆధార్ ద్వారా నేరుగా రాయితీలు పంపిణీ చేయడాన్ని సమర్థిస్తున్నాం. తెలంగాణ ఈ విషయంలో ముందు వరుసలో ఉంది. ఉపకార వేతనాలను మేం 100 శాతం ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నాం.
 - రెసిడెన్షియల్ పాఠశాలలు పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్నాయి. అందువల్ల రెసిడెన్షియల్ పాఠశాలల విధానాన్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలి. అలాగే నియామక ప్రక్రియను మెరుగుపరచాలి. ఉపాధ్యాయ నియామకాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరపాలని తెలంగాణ నిర్ణయించింది. ఉపాధ్యాయులకు శిక్షణ
 
 ప్రమాణాలను ఎన్‌సీటీఈ ద్వారా మెరుగుపరచాలి. ఉపాధ్యాయుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేయాలి. విద్యార్థుల ప్రతిభను ఆన్‌లైన్‌లో నిరంతర మూల్యాంకన విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అమలు  చేయాలి.
 - కేజీ టు పీజీ వరకు సమగ్ర విద్యావిధానం ఉండాలి. అందరికీ అందుబాటులో, నాణ్యతతో కూడిన విద్య అందాలి. ఇందుకు కేంద్ర సాయం అందాలి.
 - దేశ అంతర్గత భద్రత విషయంలో పోలీసు వ్యవస్థ ఆధునీ కరణ అత్యంత కీలకం. కానీ  ఇందుకు కేంద్ర నిధుల కేటాయింపు తగ్గిపోయింది. టెక్నాలజీ వినియోగం విరివిగా ఉండాలి. మారుమూల ప్రాంతాల్లోనూ సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలి.
 - రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలను బలోపేతం చేయాలి.
 -  కొత్తగా కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఏదైనా చట్టం తెస్తే అందుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలి.
 - వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిపరచడం ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని పరిష్కరించవచ్చు. కేంద్రం తగినన్ని నిధులు ఇచ్చి మౌలిక వసతులను మెరుగుపరచాలి. రహదారులు, విద్యావసతులు సమకూర్చాలి. రహదారుల నిర్మాణానికి తెలంగాణ పంపిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలి.
 - కేంద్ర-రాష్ట్రాల సంబంధాలను అంతర్రాష్ట్ర మండలి వేదిక ద్వారా బలోపేతం చేసుకోవాలి.
 
 సీఎం కేసీఆర్‌కు తీవ్ర  జ్వరం
 అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ శనివారం ఉదయం సమావేశానికి హాజరైనా తీవ్ర జ్వరం కారణంగా గంటన్నరపాటు మాత్రమే ఉన్నారు. సమావేశం ప్రారంభంలో ఆయన ప్రధానిని కలిశారు. అస్వస్థతకు గురైన విషయాన్ని వివరించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రసంగాలు అయ్యే వరకు ఉన్న కేసీఆర్.. 11.30 గంటలకు తన అధికార నివాసానికి చేరుకున్నారు.
 
 ఢిల్లీ వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా జ్వరం వచ్చి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఆయుర్వేద వైద్య నిపుణుడిని రప్పించినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. సీఎం ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. జ్వరం తగ్గకుంటే వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా షెడ్యూల్‌లో ఉన్నా అందులో కేసీఆర్ పాల్గొనే అవకాశాల్లేవని పార్టీ వ ర్గాలు తెలిపాయి.
 
  అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు పరిష్కరిస్తూ అవార్డు జారీ చేయడంలో నిర్దిష్ట కాలవ్యవధిని అనుసరించేలా కేంద్రం ఒక విధానం ప్రవేశపెట్టాలి. ఈ మేరకు పూంచీ కమిషన్ చేసిన  సిఫారసును అమలు చేయాలి.
 
  కొత్త రాష్ట్రంగా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను నెరపడంలో తెలంగాణ ముందుంది. గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకతో తాగునీటికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని కేంద్రం పరిష్కరించాలి.

మరిన్ని వార్తలు