నో హెల్మెట్‌, నో పెట్రోలు : ఈ రోజు నుంచే

1 Jun, 2019 19:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి  వచ్చాయి.  హెల్మెట్‌ లేకుండా  ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్‌ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్‌ రైడర్స్‌ హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్‌ పోయరు. ఈ నిబంధన జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.

రోడ్డు భద్రతను ప్రోత్సహించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు పెట్రోల్‌ పంపుల యజమానులతో సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతానికి ఈ అదేశాలను రెండు నగరాల్లో అమలు చేయాలని, అనంతరం  ఇతర ప్రాంతాల్లో  కూడా అమలు చేయాలని యజమానులను ఆదేశించారు.

హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే, డ్రైవింగ్‌ లైసెన్సును  రద్దు చేయడంతోపాటు,  చట్టపరమైన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని కలెక్టర్‌ సింగ్‌ తెలిపారు. అలాగే  పెట్రోల్‌ బంకుల్లోని సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే రైడర్లను అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఐపీసీ క్రిమినల్‌  ప్రొసీజర్ కోడ్ 151 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేస్తామని  ఆయన చెప్పారు.  కాగా మోటారు వాహనాల చట్టం 129 సెక్షన్ ప్రకారం, హెల్మెట్‌ లేని ప్రయాణం నేరం. దీని  ఉల్లఘించినవారికి 6 నెలలు  జైలు శిక్ష విధించవచ్చు.

మరిన్ని వార్తలు