చర్చలు విఫలం.. నిరవధిక సమ్మెలో ఓలా, ఊబర్‌ డ్రైవర్లు

2 Nov, 2018 10:22 IST|Sakshi

ముంబై గురువారం ఓలా, ఊబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరవధికంగా సమ్మెను కొనసాగించాలని క్యాబ్‌ డ్రైవర్లు నిశ్చయించుకున్నారు. క్యాబ్‌ సంస్థల యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఓలా, ఉబర్‌ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్‌ డ్రైవర్లు గత పదకొండు రోజులుగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఓలా, ఊబర్‌ సంస్థల యాజమాన్యం తమ డిమాండ్‌లను పట్టించుకోవటంలేదని ‘‘మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కమ్‌గర్‌ సంఘ్‌’’(ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్‌) ఆరోపించింది. 

ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్‌ అధ్యక్షుడు గోవింద్‌ మోహితే మాట్లాడుతూ.. ఓలా, ఊబర్‌ సంస్థల యాజమాన్యం పోలీసు అధికారుల సమక్షంలో తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినా.. చర్చల్లో ఇందుకు భిన్నంగా నడుచుకున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. జీతాలు పెంచుతానని చెప్పి తమని మోసం చేసిన ఓలా, ఊబర్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. 

చదవండి : మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్‌ స్ట్రైక్‌

మరిన్ని వార్తలు