రామ్‌పాల్ అరెస్ట్‌కు రూ. 26 కోట్లు!

29 Nov, 2014 02:27 IST|Sakshi
రామ్‌పాల్ అరెస్ట్‌కు రూ. 26 కోట్లు!
  • పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పణ
  •  రామ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్‌పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్‌కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్‌పాల్‌ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్‌సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు హాజరుపరిచారు. రామ్‌పాల్‌తో పాటు సహ నిందితులైన రామ్‌కన్వర్ ధాకా, ఓపీ హుడాలను కూడా కోర్టులో హాజరుపరిచారు.

    హర్యానా డీజీపీ ఎస్‌ఎన్ వశిష్ఠ్ హిస్సార్ జిల్లా బర్వాలాలోని సత్‌లోక్ ఆశ్రమంలో చేపట్టిన ఆపరేషన్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రామ్‌పాల్ అరెస్ట్‌కు అయిన ఖర్చు వివరాలను పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాయి. హర్యానా డీజీపీ కోర్టు సమర్పించిన అఫిడవిట్‌లో రామ్‌పాల్ ఆపరేషన్ కోసం హర్యానా ప్రభుత్వం రూ.15.43 కోట్లు చేసినట్టు వెల్లడించారు.

    ఇందులో రూ. 2.19 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని, పోలీసు యంత్రాంగాన్ని తరలించేందుకు రూ. 7 కోట్లు, రైల్వే పోలీసుల కోసం రూ. 1.69 కోట్లు, రవాణా వ్యయం కింద రూ. 2.36 కోట్లు, సిబ్బంది ఆహారానికి రూ. 4.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు.

    మరోవైపు రామ్‌పాల్ అరెస్ట్‌కు, కోర్టులో హాజరుపరచడం కోసం ఏర్పాట్లు చేయడానికి పంజాబ్ రూ.4.34 కోట్లు, చండీగఢ్ రూ.3.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3.55 కోట్లు వెచ్చించినట్టు కోర్టుకు తెలిపాయి. నవంబర్ 19న రామ్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సత్‌లోక్ ఆశ్రమం వద్దకు రావడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు.
     

మరిన్ని వార్తలు