మన డ్యామ్‌లు సురక్షితమేనా?

1 Sep, 2014 01:31 IST|Sakshi
మన డ్యామ్‌లు సురక్షితమేనా?

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 600 డ్యామ్‌లు
పాత ఆనకట్టలను  కూల్చేయాలంటున్న నిపుణులు
 

న్యూఢిల్లీ: దేశంలోని ఆనకట్టల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. భూకంపాలకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో 600లకు పైగా భారీ డ్యామ్‌లు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. గత యాభై ఏళ్లలో నిర్మించిన 3 వేల డ్యామ్‌లు సహా దేశవ్యాప్తంగా 5 వేల భారీ ఆనకట్టలు ఉన్నాయి. మొత్తంమీద 9 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి ఇవి సాగు వసతి కల్పిస్తున్నాయి. వీటిలో కేవలం 3% ప్రాజెక్టుల్లో జలవిద్యుదుత్పత్తి జరుగుతోంది. 2011లో జపాన్‌లో వచ్చిన భారీ భూకంపం, ఆ ప్రభావంతో వచ్చిన సునామీ అక్కడి ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని నాశనం చేసిన ఉదంతంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడంం తెలిసిందే.
 
దీంతో భారత్‌లోని భారీ ఆనకట్టల భద్రతపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని డ్యామ్‌లన్నీ అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపాలను, సునామీలను కూడా తట్టుకోగలవని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. ‘ఫుకుషిమా ఘటన అనంతరం దేశంలోని అన్ని ఆనకట్టలు, అణు విద్యుత్కేంద్రాలపై భద్రతకు సంబంధించిన పరీక్షలు జరిపారు. అవన్నీ 100% సురక్షితం’ అని ఇటీవల కేంద్రం చెప్పింది.  అయితే, నిపుణుల అభిప్రాయం వేరేలా ఉంది. భారత్‌లోని చాలా డ్యామ్‌లు చాలాఏళ్ల క్రితం నిర్మించినవని, అవి ఇప్పుడు సురక్షితం కావని, వాటిని కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. వంద పాత డ్యామ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని సౌత్ ఏషియా నెట్‌వర్క్ ఆఫ్ డ్యామ్స్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ చెప్పారు.   
 
చాలా డ్యామ్‌లు భారీ వరదలు వచ్చే ప్రాంతాల్లో, బలహీనమైన ప్రదేశాల్లో నిర్మించారని, అవి భూకంపాలకు కారణమవుతాయని రామస్వామి అయ్యర్ అనే నిపుణుడు అన్నారు. అయితే, డ్యామ్‌ల కూల్చివేతకు చాలాకాలం పడుతుందని, కొత్త ఆనకట్టల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకొని ఉన్నదని జనవనరుల శాఖ వారి వాదన. 118 ఏళ్లనాటి ముళ్లపెరియార్ ఆనకట్టపై  వ్యక్తమవుతున్న భయాందోళనలు సమంజసమేనని చాలామంది అభిప్రాయం. కేరళలో  ఉన్న ఆ డ్యామ్ వల్ల తమిళనాడులోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే, భద్రతాకారణాల దృష్ట్యా ఇప్పుడు ఆ డ్యామ్‌ను కూల్చేయాలని కేరళ డిమాండ్ చేస్తుండగా.. ఆ ఆనకట్ట సురక్షితమేనని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది.
 
 భారత్‌లో డ్యామ్ ప్రమాదాలు

* 1979లో గుజరాత్‌లోని మొర్బి డ్యామ్ కూలడంతో 5 వేల మంది చనిపోయారు. భారీ వర్షాలతో భారీగా నీరురావడంతో  గోడలు బలహీనమై డ్యామ్ కూలిపోయింది.
* 2008లో భారత్- నేపాల్ సరిహద్దుల్లోని సప్తకోషి నదిపై నిర్మించిన డ్యామ్ ఒక్కసారిగా బద్ధలవడంతో భారీ వరదలు బీహార్‌ను ముంచెత్తాయి.
* 1969లో మహారాష్ట్రలోని కోయినానగర్‌లో సంభవించిన భారీ భూకంపానికి అక్కడి రిజర్వాయర్ వల్ల ఏర్పడే భూప్రకంపనలు ఒక కారణమని భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం.

మరిన్ని వార్తలు