మోదీజీ..ఈ మూడింటిపై నోరు మెదపండి!

29 Jan, 2020 12:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ మరో మూడు రోజుల్లో ముందుకొస్తున్న క్రమంలో మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్ధ కుదేలైన తీరును ప్రస్తావించారు. పన్ను రాబడి పడిపోయిందని, రిటైల్‌ ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వెచ్చించే నిధుల్లో కోత వేశారని వీటిపై ప్రధాని మోదీ నోరుమెదపాలని దుయ్యబట్టారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దుందుడుకు ధోరణిని విడనాడి ఆరేళ్లలో కూడా అచ్ఛేదిన్‌ (మంచిరోజులు) ఎందుకు రాలేదో ఓటర్లకు వివరించాలని చురకలు వేశారు. వాస్తవాలను విస్మరించి ప్రధాని, కేంద్ర మంత్రులు భ్రమల్లో విహరిస్తున్నారని చిదంబరం ట్వీట్‌ చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఢిల్లీలోని తిహార్‌ జైలులో 100 రోజులు పైగా గడిపిన చిదంబరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్‌ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం లేదని తరచూ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు