హెచ్చరికలను పట్టించుకోలేదు!

10 Sep, 2014 02:51 IST|Sakshi
హెచ్చరికలను పట్టించుకోలేదు!

* వరదల విషయంలో జమ్మూ కాశ్మీర్ తీరుపై నిపుణుల విమర్శ
* పట్టణీకరణ, అడవుల నరికివేత వల్లే ఎక్కువ నష్టాలు

 
శ్రీనగర్: గతేడాది ఉత్తరాఖండ్‌ను ముంచెత్తి 5 వేల మందిని బలితీసుకున్న మెరుపు వరదలైనా.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ను కల్లోలం చేస్తున్న వరదలైనా... రెండింటికీ ప్రధాన కారణం ఒకటేనంటున్నారు పర్యావరణ వేత్తలు. పట్టణీకరణ పెరిగిపోవడం, రక్షణ కవచలంలా ఉండే అడవులు తగ్గిపోవడంతోపాటు అనూహ్యమైన రుతుపవనాలు.. ఈ విలయానికి కారణమయ్యాయంటున్నారు. పొంచి ఉన్న ముప్పుపై వాతావరణ నిపుణుల హెచ్చరికలను అధికారులు పెడచెవిన పెట్టడంతో.. నష్ట తీవ్రత పెరిగిందని అంటున్నారు.

ముందే హెచ్చరించాం: జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తాము సెప్టెంబర్ 2 నుంచి ప్రతిరోజూ అధికారులకు హెచ్చరికలు జారీచేశామని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని కుటుంబాలే సురక్షిత ప్రాంతాలకు పోయి తలదాచుకున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో ఉండిపోయిన వారిని తరలించ టంలో రాష్ట్రం నిర్లక్ష్యం వహించిందని విమర్శించింది.
 
 నదీ తీరాల్లో భారీ నిర్మాణాలు..
 ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, గతేడాది ఉత్తరాఖండ్‌లలో పరిస్థితులను పోల్చి చూస్తే.. రెండింటికీ చాలా సామీప్యతలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రెండుచోట్లా.. ప్రధాన కారణం పశ్చిమ గాలులు, రుతుపవనాలు కలిసి కురిసిన ఎడతెగని వానలేనన్నారు. భారీ స్థాయిలో అడవులను నరికేయడం, నదీ తీరాల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల ఉత్తరాఖండ్‌లో నష్టాల తీవ్రత ఎక్కువయింది. జమ్మూ కాశ్మీర్‌లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మ్మెంట్’ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ చంద్ర భూషణ్ అన్నారు.
 
 122 రెట్లు ఎక్కువ వర్షపాతం
 భారత్‌లో రుతుపవనాలను అంచనావేయడం ఎప్పుడూ సవాలే. అయితే ఇటీవల వర్షాలు తరచూ కురుస్తూ తీవ్ర నష్టానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. శ్రీనగర్‌లో.. పెప్టెంబర్ 5న సాధారణ వర్షపాతం 0.4 మిల్లీమీటర్లు కురవగా ఈ ఏడాది 49 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే 122 రెట్లు ఎక్కువ. ‘‘అనూహ్యంగా వర్షాలు కురిసే పరిస్థితికి ముందే సిద్ధమై ఉండాలి.’’ అని భూషణ్ అన్నారు.

ఒడిశా స్థాయిలో జాగ్రత్తపడాలి: వాతావరణ హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా సమయానికి స్పందించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు. గతేడాది ఫైలిన్ తుపాను సమయంలో ఒడిశా ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేయడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం  స్వల్పంగా ఉందని భూషణ్ గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు