చిక్కుల్లో యూపీ సీఎం

11 Apr, 2018 01:40 IST|Sakshi

యోగి పాలనపై ప్రజల్లో అసంతృప్తి

వ్యవహారశైలిపైనా విమర్శలు

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రతిష్ట మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గద్దెనెక్కి ఏడాది తిరిగిందో లేదో ఆయనపై ఫెయిల్యూర్‌ సీఎం అని ముద్ర పడిపోతోంది. పాలనలో వైఫల్యాలు, భాగస్వామ్య పార్టీల అసంతృప్తి సెగలు, ఉప ఎన్నికల్లో ఓటమి, సహచర మంత్రులతో, ప్రజలతో వ్యవహారశైలి, రాష్ట్ర నాయకత్వంపై నలుగురు దళిత ఎంపీల తిరుగుబాటు.. ఇవన్నీ కలిసి యోగికున్న ఇమేజ్‌ని డ్యామేజీ చేసేస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

స్త్రీలపై ఆకృత్యాలు, పాఠశాలల్లో ఫీజులు, అవినీతి తదితరాలను నియంత్రించడంలో యోగి విఫలమయ్యారని ఇటీవల ఓ సర్వేలో పాల్గొన్న అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేస్తే.. ఆమె తండ్రినే పోలీసులు అరెస్టు చేయగా ఆయన కస్టడీలోనే మరణించడం తాజాగా యోగి ప్రభుత్వాన్ని మరిన్ని చిక్కుల్లో పడేసింది. సరిగ్గా ఏడాది క్రితం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా యోగిని తీసుకువచ్చి సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.

కానీ సంవత్సరం తిరిగేలోగా ఎన్నో వివాదాలు ఆయనని చుట్టుముట్టాయి. ముఖ్యంగా రాష్ట్రంలో భద్రత గాల్లో కలిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీకి కంచుకోటవంటి గోరఖ్‌పూర్, ఫూల్‌పుర్‌ ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకాతేరుకోకముందే రాష్ట్రంలో దళితులపై అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ సొంత పార్టీకి చెందిన నలుగురు దళిత ఎంపీలు సావిత్రీబాయి ఫూలే, చోటేలాల్, యశ్వంత్‌ సింగ్, అశోక్‌ డోహ్రెలు రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

ఇక ప్రభుత్వ భవనాలకు, చివరికి అంబేడ్కర్‌ విగ్రహానికి కూడా కాషాయ రంగు పూయడం వివాదానికి దారి తీసింది. మరోవైపు యూపీలో బీజేపీ మిత్రపక్షమైన సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) నాయకుడు ప్రకాశ్‌ రాజభర్‌ కూడా సీఎం తనని ఖాతరు చేయడం లేదని సంకీర్ణ ధర్మానికి తిలోదకాలు ఇచ్చారంటూ ధ్వజమెత్తడం కలకలం రేపింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ నివేదికతో ప్రమాద ఘంటికలు
యోగిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో నిజానిజాలను తెలుసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హోసబోలే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. యోగి పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందని వారి పరిశీలనలో వెల్లడి కావడంతో ఆదిత్యనాథ్‌ చిక్కుల్లో పడినట్టయింది.

దీంతో గత శనివారం ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీకి యోగి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే యోగి ప్రభుత్వంలోనూ, పార్టీపరంగానూ భారీగా మార్పులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. యూపీలో పరిస్థితిని చక్కదిద్దడానికి బుధవారమే అమిత్‌ షా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరి షా పర్యటనతో యూపీలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు