కిసాన్‌ క్రాంతి యాత్ర : రైతులపై ఖాకీ జులుం

2 Oct, 2018 16:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించి లాఠీచార్జి జరపడాన్ని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఖండించారు. గాంధీ జయంతి రోజున బీజేపీ ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తిన రైతులను నెట్టివేసిందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టి ఢిల్లీకి వస్తున్న క్రమంలో వారిని బలవంతంగా పోలీసులు తోసివేయడం దారుణమని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

రైతులను ఢిల్లీ రాకుండా ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వంపై రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రస్తుతం రైతులు తమ ఇబ్బందులు తెలిపేందుకు దేశ రాజధానికి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రైతుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎస్‌పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సహా పలువురు విపక్ష నేతలు మోదీ సర్కార్‌ను తప్పుపట్టారు. రైతులను ఢిల్లీకి వచ్చేందుకు అనుమతించాలని, వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని..తాము రైతులకు బాసటగా నిలుస్తామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

రైతులకు చేసిన వాగ్ధానాలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో వారు ఆందోళనకు పూనుకోవడం సరైనదేనని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, స్వాతంత్ర్యానంతరం రైతులను సంక్షోభంలోకి నెట్టిన తొలి సర్కార్‌ ఇదేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు.


ఢిల్లీలో 144 సెక్షన్‌
రుణమాఫీ, ఇంధన ధరల తగ్గింపు, చెరకు బకాయిల చెల్లింపు, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన వంటి పలు డిమాండ్లతో రైతులు ఢిల్లీకి చేరుకుంటుండగా, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తూర్పు, ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144వ సెక్షన్‌ విధించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీకి వచ్చే రహదారులపై ట్రాఫిక్‌ పలుచోట్ల నిలిచిపోయింది. యూపీ బోర్డర్‌లో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలు గుమికూడరాదని, లౌడ్‌స్పీకర్లు వాడరాదని నిషేదాజ్ఞలు విధించారు. సెప్టెంబర్‌ 23న హరిద్వార్‌లో ప్రారంభమైన కిసాన్‌ క్రాంతి యాత్రలో యూపీలోని పలు ప్రాంతాల నుంచి రైతులు జత కలిశారు. రైతులు పెద్దసంఖ్యలో కాలినడకన, ట్రాక్టర్లలో, వాహనాల్లో తమ తమ గమ్యస్ధానాల నుంచి ఆందోళన బాటపట్టారు.


డిమాండ్లపై సర్కార్‌ సానుకూలం
ఢిల్లీ-యూపీ బోర్డర్‌లో నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చర్చలు జరిపారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై కేంద్రం సానుకూలంగా లేకున్నా ఇతర డిమాండ్లపై మెతకవైఖరి ప్రదర్శించింది. మరోవైపు రైతుల నిరసనలతో యూపీ సర్కార్‌ దిగివచ్చింది. రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్‌ చేపట్టిన విధానానికి అనుగుణంగా తాము పలు చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తాము తొలిసారిగా సన్న, మధ్యతరహా రైతులకు రుణమాఫీ ప్రకటించామని చెప్పుకొచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు