రైలు ప్రమాదం: రాజకీయ దుమారం..!

21 Oct, 2018 09:15 IST|Sakshi
సుఖ్‌భీర్‌ సింగ్‌ బాదల్ (ఫైల్‌ ఫోటో)

రైల్‌ ప్రమాదంపై రాజకీయ నాయకుల ఆరోపణలు

తమ తప్పేమీ లేదని చేతులు దులుపుకున్న రైల్వే శాఖ

అమృత్‌సర్‌  : అమృత్‌సర్‌ రైలు ప్రమాదంపై  రాజకీయ దుమారం చెలరేగుతోంది. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన నాయకులు ప్రమాదానికి కారణం మీరంటే మీరేనని ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీలు అధికార పక్షమైన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ పక్కన రావణ దహనం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీనే పరోక్షంగా ప్రమాదానికి కారణమైందని కేంద్రమంత్రి, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ విమర్శించారు. కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకుండా, రైల్వే శాఖకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రావణ దహనం చేశారని నిర్వహకులుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

ఇవ్వన్నీ ఇలా ఉండగా ప్రమాదంపై తమ తప్పేమీ లేదని, సిగ్నల్స్‌ అన్నీ క్లియర్‌గా ఉన్నందుకే రైలు వేగంగా దూసుకుని వెళ్లిందని రైల్వే శాఖ ప్రకటించి చేతులు దులుపుకుంది. నాయకులు ప్రకటనలపై సామన్య ప్రజలు దుమ్మెతిపోస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిపోయి మీరంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఏంటిని కొందరు ప్రశ్నిస్తుండగా.. ప్రమాదాన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తుండడం బాధకరమని ప్రముఖలు సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ భార్య నవజ్యోత్‌కౌర్‌ సిద్దు తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆమె కనీసం ఘటన స్థలికి వెళ్లకుండా ప్రమాదం జరిగిన వెంటనే ఆమె వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రైల్వే ట్రాక్‌పై మేం నిలుచోమని చెప్పామా.. వాళ్లపై నుంచి వెళ్లమని ట్రైన్‌కు మేం చెప్పామా అంటూ దురుసుగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ ప్రకటించారు. కాగా ప్రమాదంపై ఇప్పటివరకూ ఏఒక్కరిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు