రండి.. మాట్లాడుకుందాం! 

21 Oct, 2018 09:16 IST|Sakshi
పార్టీ అధినేత కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన నెలన్నర తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మరో కీలకభేటీ సిద్ధమయ్యారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 105 మందితో జాబితా ప్రకటించిన ఆయన.. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కీలకనేతలతో సమీక్ష నిర్వహించారు. వారం రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ, అభ్యర్థుల పరిస్థితిపై స్వయంగా ఆయనే ఫోన్‌ చేసి ఆరా తీశారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారశైలి, అసంతృప్తులు, గ్రూపులపోరు, ప్రజలు స్పందిస్తున్న తీరుపైనా ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలు తెప్పించుకున్నారు.

ఇదే సమయంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు సంబం«ధించి 13 నియోజకవర్గాలకుగాను ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రభుత్వ విప్‌ కొప్పుల ఈశ్వర్‌తోపాటు మొత్తం 12 మంది అభ్యర్థులకు కేసీఆర్‌ నుంచి పిలుపు అందింది. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించనందున శనివారం రాత్రి వరకూ ఎవరికీ సమాచారం అందులేదు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారవేగాన్ని పెంచడంతోపాటు ‘ముందస్తు’ వ్యూహాలకు అధినేత మరింత పదును పెట్టనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత అందరూ ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్‌ ఇదివరకే ఆదేశించారు. ఇదే క్రమంలో అభ్యర్థులు సైతం ఇప్పటికే ఒకటి, రెండు విడుతల ప్రచారాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఇటీవల పాక్షిక మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. అభ్యర్థులు కోరుకున్నట్లుగానే మేనిఫెస్టోలో పలు అంశాలను చేర్చడం, ఆసరా పింఛన్లు, పెట్టుబడిసాయం పెంచడం వంటి అంశాలు వారి ప్రచారాన్ని ఉధృతస్థాయికి చేర్చాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రచారానికి విరామం కలగగా.. శుక్రవారం నుంచి మళ్లీ ప్రచారానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టారు.

ఇదే సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో కీలక భేటీ నిర్వహించనుండటం పార్టీ కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ‘50 రోజులు 100 సభలు’ పేరిట ప్రచారానికి వచ్చేవారంలో సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా దాదాపు పూర్తిదశకు చేరినట్లు కూడా ప్రకటించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్‌ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం, ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే పథకాలు తదితర అంశాలపై నేడు కీలక చర్చ జరపునున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం.. అదే సమయంలో ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేసేలా చూడటం.. తదితర పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించనున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా ముందస్తు వ్యూహానికి మరింత పదును పెట్టే పలు అంశాలపై నియోజకవర్గాలవారీగా చర్చించనున్నట్లు తెలిసింది.

ఇంటెలిజెన్స్‌ నివేదికలపైనా చర్చ.. అనుకూల, ప్రతికూలతలపై సమీక్ష
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్న గులాబీ దళపతి కేసీఆర్‌.. ఆదివారం నిర్వహించే సమావేశం మరింత కీలకమైంది. సెప్టెంబర్‌ 6న అభ్యర్థులను ప్రకటించగా సుమారు 45 రోజుల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులపై వచ్చిన ‘ఫీడ్‌బ్యాక్‌’, అనుకూల, ప్రతికూలతలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ప్రచారం ఉంది. ఇంటెలిజెన్స్, పార్టీ సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

పూర్వ కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉండగా వేములవాడ, రామగుండం, జగిత్యాల నియోజకవర్గాల్లో అభ్యర్థులకు అసంతృప్తులు, రెబల్స్‌ బెడద ఉంది. చొప్పదండిలో అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోగా.. పెద్దపల్లి, మంథని, మానకొండూర్‌లోనూ చాపకింది నీరులా అసంతృప్తి కొనసాగుతోంది. వేములవాడ, రామగుండంలో అభ్యర్థులు చెన్నమనేని రమేశ్‌బాబు, సోమారపు సత్యనారాయణను మార్చాలని వారి వ్యతిరేకులు బలంగా ఎదురునిలుస్తున్నారు. రామగుండంలో రెబల్‌ అభ్యర్థిగా కోరుకంటి చందర్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు.

వీటన్నింటిపైనా  సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మహాకూటమి సీట్లు, అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోగా.. ఏయే నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశాలను చర్చించే అవకాశం ఉండగా.. బలమైన అభ్యర్థులుగా భావించే వారిని ఎలా ఎదుర్కోవడం..? అన్న కోణంలో కూడా చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 2014 ఎన్నికల్లో మొత్తం 13 స్థానాలకు 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురేసిన టీఆర్‌ఎస్‌.. ముందస్తు ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించేందుకు వీలుగా సమావేశంలో అన్ని అంశాలపై చర్చ జరగనుందని తెలిసింది.
 
చొప్పదండి అభ్యర్థిపై నేడు నిర్ణయం?
చొప్పదండి నియోజవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 6న రాష్ట్రవ్యాప్తంగా 105 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ దళపతి కేసీఆర్‌ 14 స్థానాలపై సస్పెన్స్‌లో పెట్టారు. ఉమ్మడి కరీంనగర్‌లో 13 స్థానాలకు 12 స్థానాలకు గతంలో పోటీచేసిన అభ్యర్థుల పేర్లనే ఖరారు చేసిన ఆయన ఒక్క చొప్పదండిలో అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేదు. టికెట్ల ప్రకటనకు ముందే చొప్పదండి నియోజకవర్గానికి చెందిన 18 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ముఖ్యనేతలు కలిసి శోభకు టికెట్‌ ఇవ్వరాదంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ అభ్యర్థుల ప్రకటనలో చొప్పదండిని హోల్డ్‌లో పెట్టారు.

దీంతో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ పేరు తెరపైకి రాగా.. రిటైర్డు ఆర్‌డీవో బైరం పద్మయ్య కూడా ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. అయినప్పటికీ టికెట్లను ప్రకటించి 45 రోజులు గడుస్తున్నా.. చొప్పదండి అభ్యర్థి ఎవరనేది సస్పెన్ప్‌గా మారింది. ఓ వైపు బొడిగ శోభ, మరోవైపు మెజార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సుంకె రవిశంకర్‌ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌ నిర్వహించే కీలకభేటీకి మంత్రులు సహా 12 మంది అభ్యర్థులకు ఆహ్వానం అందగా.. శనివారం రాత్రి వరకు చొప్పదండి నుంచి ఎవరికీ పిలుపు రాలేదు. సమావేశం తర్వాత చొప్పదండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు