మొబైల్‌ ప్రీపెయిడ్‌ సేవలు మళ్లీ ప్రారంభం..!

14 Oct, 2019 20:46 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం 72 రోజుల తర్వాత రాష్ట్రంలో మొబైల్‌ ప్రీపెయిడ్‌ సర్వీసులు పునరుద్ధరించారు. దీనిప్రకారం సోమవారం నుంచి 40 లక్షల మొబైల్‌ ప్రీపెయిడ్‌ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అయితే, ఇంకా 20 లక్షల ఇంటర్నెట్‌ సేవలు, ప్రీపెయిడ్‌ కనెక్షన్లు మాత్రం పునరుద్దరించటానికి మరికాస్తా సమయం పట్టేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేసే ముందు రోజు అనగా ఆగష్టు 4న జమ్మూకశ్మీర్‌ అంతటా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు నుంచి కశ్మీరీలు మొబైల్‌ కనెక్టీవిటీ లేకుండానే 72 రోజులు గడిపారు.

తాజాగా ప్రభుత్వం రాష్టంలోని పరిస్థితిని సమీక్షించిన అనంతరం మొబైల్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ కాస్తా భిన్నంగా ఉంటుందని, మొదట కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలను మాత్రమే  పునరుద్దరించినట్లు, అనంతరం ఇతర ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్  తెలిపారు. అయితే ఆగష్టు 17వ తేదీనే జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొన్నిలైన్ల టెలిఫోన్‌ సేవలను, సెప్టెబర్‌ 4నాటికి 50 వేల ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లను పునరుద్ధరించబడ్డాయి. కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయడం, విద్యాసంస్థలు యథావిధిగా నడవడంతో రాష్ట్రంలోని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు