చిన్నా, పెద్దా ఇద్దరూ మనోళ్లే

11 Sep, 2019 05:57 IST|Sakshi

దేశంలోనే పిన్నవయసు గవర్నర్‌గా తమిళి సై రికార్డు

అత్యంత సీనియర్‌గా నిలిచిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలైన తమిళిసై సౌందరరాజన్‌(58) సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రస్తుతం దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన గవర్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌ పదవీకాలం ముగియడంతో తమిళి సై కొత్తగవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌(85) మరో రికార్డు సాధించారు. దేశంలోనే అత్యంత పెద్దవయస్కుడైన గవర్నర్‌గా హరిచందన్‌ నిలిచారు.

ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలకు నియమితులైన 28 గవర్నర్లలో ఒక్క తమిళి సై మాత్రమే 60 ఏళ్లలోపు వయసువారు కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆచార్య దేవవ్రత్‌(60) పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో గుజరాత్‌ గవర్నర్‌గా నియమించింది. ఇక హరిచందన్‌ తర్వాత మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(84) రెండో స్థానంలో నిలిచారు.  మొత్తం 28 మంది గవర్నర్లలో చాలామంది 70–79 ఏళ్ల వయసువారే ఉన్నారు. ఈ జాబితాలో ఏడుగురు గవర్నర్లకు 60 ఏళ్లు ఉండగా, మరో 14 మంది గవర్నర్లకు 70 సంవత్సరాలు నిండాయి. ఇక ఆరుగురు గవర్నర్ల వయసు 80 ఏళ్లకు చేరుకుంది. ఈ 28 మంది గవర్నర్లలో 19 మంది రాజ్‌భవన్‌లో తొలిసారి అడుగుపెట్టారు.

మరిన్ని వార్తలు