ఉగ్రవాది ఆదిల్‌కు శిక్షణ ఇచ్చింది అతడే!

16 Feb, 2019 21:17 IST|Sakshi

అప్పటి దాకా సహచరులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుతూ సాఫీగా సాగిపోతున్న భారత సైనికుల ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యుఘోష. జవాన్ల కాన్వాయ్‌ని ఢీకొట్టి యావత్‌ భారతావనికి తీరని శోకం మిగిల్చాడు కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే కమాండర్‌ ఆదిల్‌ అలియాస్‌ వకాస్‌. తనను తాను పేల్చుకుని మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జవాన్లను పొట్టనబెట్టుకోవడానికి ముందే తన ఆశయం నెరవేరిన వెంటనే స్వర్గంలో ఉంటానంటూ ఆదిల్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆత్మాహుతికి ముందు అతడు ఎంతగా శిక్షణ పొందాడో అర్థమవుతోంది. (మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ)

పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్‌ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్‌ అదృశ్యమయ్యాడు. ఇక ఆనాటి నుంచి జైషే కమాండర్‌గా మారిన ఆదిల్‌ ప్రస్తుతం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అయితే తనకు అప్పగించిన ఆపరేషన్‌ను ఆదిల్‌ పక్కాగా అమలు చేయడానికి జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ ఘాజీ అబ్దుల్‌ రషీద్‌ ఇచ్చిన శిక్షణే కారణమని ఇంటలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. (ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!)

ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ ఘాజీ..
జైషే ఉగ్రసంస్థ చీఫ్‌ మసూద్‌ అజహర్‌కు ఘాజీ అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ గ్రూపులో శిక్షణ పొందిన ఈ 32 ఏళ్ల ఉగ్రవాది.. 2008లో జైషేలో చేరాడు. అనతి కాలంలోనే మసూద్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఘాజీ.. ఐఈడీ తయారు చేయడం, అమర్చడం, పేల్చడంలో నిపుణుడు. 2010 నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జైషేలో యువకులను చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం పుల్వామా జిల్లాలో జైషే చీఫ్‌ మసూద్‌ మేనల్లుళ్లు తాలా రషీద్ (2017)‌, ఉస్మాన్‌ (2018)లను  భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో వారి మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భావించిన మసూద్‌ ఘాజీని రంగంలోకి దింపినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఘాజీ దక్షిణ కశ్మీర్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తీవ్రవాద భావాలున్న యువకులను ఆకర్షించి... జైషేను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆదిల్‌ వంటి ఎంతోమంది యువకులను అతడు జైషేలో చేర్చుకుని శిక్షణనిచ్చినట్టు సమాచారం. ఎక్కడైతే తన మేనల్లుళ్లను అంతం చేశారో .. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్‌ ఇటీవలే ఘాజీకి సూచించిన క్రమంలో ఆదిల్‌ ద్వారా గురువారం నాటి హింసరచన సాగించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల  పుల్వామాలోని రతన్‌పోరాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఘాజీ తృటిలో తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా సరే భరత జాతికి ఆగ్రహం తెప్పించిన మసూద్‌, ఘాజీ వంటి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు..  భారత్‌ సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న విషయం జగమెరిగిన సత్యం.

మరిన్ని వార్తలు