ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు

25 Nov, 2023 12:45 IST|Sakshi

న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. 

తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టింది.  వీరిలో 13 మంది ఇజ్రాయెల్‌ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్‌ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్‌ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్‌ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్‌ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్‌ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు.

ఈ డిమాండ్‌ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ


 

మరిన్ని వార్తలు