నల్లరంగు పూస్తే... రూ. కోటి ఇస్తా!

27 Dec, 2018 15:39 IST|Sakshi
టర్బన్‌తో విగ్రహాన్ని శుభ్రం చేస్తున్న గుర్సిమ్రన్‌ సింగ్‌

చండీగఢ్‌ : పంజాబ్‌లోని సలేమ్‌ తబ్రీ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి ఇద్దరు స్థానిక యువకులు నల్ల రంగు పులిమి వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వెంటనే రంగంలోకి దిగి పాలతో విగ్రహాన్ని శుభ్రపరిచారు. ఇందులో భాగంగా గుర్సిమ్రన్‌ సింగ్‌ అనే నాయకుడు మంగళవారం తన టర్బన్‌(సిక్కులు ధరించే తలపాగా)తో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని తుడిచారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో సిక్కు మతస్థులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో తన వాట్సాప్‌ నెంబర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసిన కెనడాకు చెందిన ఓ సిక్కు వ్యక్తి.. గుర్సిమ్రన్‌ సింగ్‌ ముఖానికి నల్లరంగు పూస్తే... కోటి రూపాయల బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. మరికొంత మంది ఎన్నారైలు సదరు నేతను బెదిరిస్తూ ఫోన్‌కాల్స్‌ చేస్తుండటంతో దీనికంతటికీ శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నాయకులే కారణమని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా 1984 నాటి సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్‌ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్‌ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని.. ఆయన విగ్రహానికి రంగు పులిమిన యువకులు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు