అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు

3 Apr, 2017 15:50 IST|Sakshi
అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు

కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడల్లా మెరికల్లాంటి కుర్రవాళ్లు వీధుల్లోకి రావడం, పోలీసులు, సైనికులు, ప్రభుత్వ అధికారులపైకి రాళ్లు రువ్వడం, వాహనాలను దగ్ధం చేయడం, దుకాణాలను తగులబెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు పెట్రోలు బాంబులు విసురుతూ బీభత్సం సష్టించడం కూడా తెల్సిందే. కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కుర్రవాళ్లు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు ముసుగులు ధరించడం లేదా  కళ్ల కిందుగా ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకోవడం, పరుగెత్తడానికి అనువుగా కాళ్లుకు తెల్లటి స్పోర్ట్స్‌ షూలను ధరించడం కనిపిస్తుంది.

నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఇలా పెడదారి పట్టి పోతోందని సామాజిక శాస్త్రవేత్తలు ఇంతకాలం సూత్రీకరిస్తూ వచ్చారు. అదే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తన కశ్మీర్‌ పర్యటన సందర్భంగా కశ్మీర్‌ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యాటకాన్ని ఎంచుకుంటారా, ఉగ్రవాదాన్ని ఎంచుకుంటారా? అని కూడా ప్రశ్నించారు. రాళ్లు రువ్వుతున్నది నిరుద్యోగ యువతేగానీ ప్రభుత్వం మీద ఆగ్రహంతోనే ఆక్రోశంతోనో వాళ్లు రాళ్లు రువ్వడంలేదు.

కేవలం డబ్బుల కోసం వారు రాళ్లు రువ్వుతున్నారు. రాళ్లు రువ్వినందుకు వారికి నెలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు జీతంగా వస్తాయట. పెట్రోలు బాంబులు తయారు చేయడానికి, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు అందుతాయట. ఈ విషయాలను రాళ్లు రువ్వుతున్న కుర్రవాళ్లు జకీర్‌ అహ్మద్‌ భట్, ఫరూక్‌ అహ్మద్‌ లోన్, వసీం అహ్మద్‌ ఖాన్, ముస్తాక్‌ వీరి, ఇబ్రహీం ఖాన్‌  ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో వెల్లడించారు.



2008, 2010 సంవత్సరాల్లో కశ్మీర్‌లో పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి బీభత్సం సష్టించిన సంఘటల్లో తాను పొల్గొన్నానని, గతేడాది బుర్హాన్‌ వాణి మిలిటెంట్‌ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కూడా తాను రాళ్లు రువ్వానని జకీర్‌ అహ్మద్‌ భట్‌ తెలిపారు. రాళ్లు రువ్వినందుకు తనకు నెలకు ఎనిమిది వేల రూపాయల వరకు అందుతాయని, తాను పెట్రోలు బాంబులు కూడా తయారు చేస్తానని, అందుకు ఒక్కోదానికి 700 రూపాయలు అందుతాయని, వాటిని విసిరినందుకు అదనపు చార్జీలు ఇస్తారని భట్‌ చెప్పారు. ‘మీకు డబ్బు ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా మీకు ఆ డబ్బు అందుతుందీ, ఎలా అందుతుందీ?’ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భట్‌ నిరాకరించారు.

‘ఇది మా బతుకుతెరువుకు సంబంధించిన అంశం. మా ప్రాణం పోతుందన్నా మా వెనకనున్న వ్యక్తుల గురించి మీము చెప్పం’ అని భట్‌ చెప్పారు. ‘కశ్మీరు పోలీసులు, సైనికులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులపై మేము ఎన్నోసార్లు రాళ్లు రువ్వాం. ఇక ముందు కూడా అదే చేస్తాం. ఇది మాకు తిండి పెడుతోంది. బారముల్లా, సొపోర్, పటాన్‌లలో కూడా నేను రాళ్లు విసిరాను. ఇప్పుడు రాళ్లు రువ్వేందుకు ప్రతి శుక్రవారం బారముల్లా పోతున్నాను. శుక్రవారం నాడు రాళ్లు రువ్వినందుకు మాకు అదనపు డబ్బులు ముట్టుతాయి’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్‌ తెలిపారు. ఇంతవరకు 50, 60 పెట్రోలు బాంబులు విసిరానని చెప్పారు.

రాళ్లు రువ్వినందుకు ఒక్కో రోజు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అందుకున్న సందర్భాలు ఉన్నాయని వసీం అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. మీకు డబ్బులిచ్చే వ్యక్తితో మీకు పరిచయం ఉందా? అన్న ప్రశ్నకు తన స్నేహితుడి ద్వారా తనకు పరిచయం అయ్యాడని లోన్‌ తెలిపారు. డబ్బులిచ్చే వ్యక్తి మిలిటెంటా లేదా టెర్రరిస్టా ? అని ప్రశ్నించగా, వారి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేనని చెప్పారు. ఎక్కడ రాళ్లు రువ్వాలో, ఎప్పుడు రాళ్లు రువ్వాలో ముందస్తు ప్రణాళిక ఉంటుందా అన్న ప్రశ్నకు లోన్‌ సమాధానమిస్తూ ముందుగానే పక్కా వ్యూహంతో తమకు కబురు అందుతుందని చెప్పారు.

రాళ్లు రువ్వే కుర్రవాళ్లలో పది, పన్నేండేళ్ల బాలలు కూడా ఉన్నారని, వారికి నెలకు ఐదువేల రూపాయల వరకు పేమెంట్లు ఉంటాయని వారు తెలిపారు. కండపుష్టి కలిగిన బలమైన యువకులకు గ్రూపులో పేమెంట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తమలో ఇప్పుడు చాలా వాట్సాప్‌ గ్రూపులున్నాయని, అత్యవసర సమయాల్లో గ్రూపు సందేశాలు పంపిస్తారని అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. వీరిలో ఒకరిద్దరు రాళ్లు రువ్విన సంఘటనల్లో అరెసై్ట ఆరు నెలలు జైలుకెళ్లిరాగా మరొకరి ఏడాది జైలు శిక్ష అనుభవించి వచ్చారు. జైలుకెళ్లి వచ్చినా మారలేదా ? అన్న ప్రశ్నకు ఇది తమ బతుకుతెరవని, మరోపని చేస్తూ బతకడం కష్టమని వారు చెప్పారు.

గతేడాది జూలై నెల నుంచి అక్టోబర్‌ నెల వరకు రాళ్లు రువ్విన సంఘటనల్లో 92 మంది మరణించగా, 19 వేల మంది ప్రజలు గాయపడ్డారు. నాలుగువేల మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇద్దరు జవాన్లు మరణించారు. కశ్మీర్‌లో ఒక్క ఏడాదిలోనే రాళ్లు రువ్విన సంఘటనలు కొన్ని వేలుంటాయి.

మరిన్ని వార్తలు