నక్సల్స్‌పై సమరమే!

9 May, 2017 02:11 IST|Sakshi
నక్సల్స్‌పై సమరమే!

మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాలి
► ‘సమాధాన్‌’ వ్యూహాన్ని సూచించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌
► ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు  


సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. నక్సల్స్‌ వ్యతిరేక కార్యక్రమాల్లో మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వె ల్లడించారు. ఢిల్లీలో సోమవారం ప్రారంభమైన మావో యిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల రెండ్రోజుల సదస్సులో రాజ్‌నాథ్‌ ప్రారంభోపన్యాసం చేశారు.

‘మన విధానాల్లో దూకుడు పెంచాలి. మన ఆలోచనల్లో, వ్యూహాల్లో, బలగాల మోహరింపులో, వ్యూహాల అమలులో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతా ల్లో రోడ్ల నిర్మాణంలో ఈ దూకుడు కనిపించాలి. మితిమీరిన ఆత్మరక్షణతో ఉండటం వల్లే కార్యాచరణలో పక్కాగా వ్యవహరించలేకపోతున్నాం’ అని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. నక్సల్స్‌ ఏరివేతకు రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు.

ఆర్థికంగా దెబ్బతీస్తే సరి..: ‘మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ఈ పోరాటంలో అత్యంత కీలకం. సరిపోయేన్ని ఆర్థిక వనరులున్నప్పుడే వారు ఆయుధాలు కొంటారు. అందుకే ఆర్థిక వనరులను దెబ్బతీయటం చాలా అవసరం’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. మావోలను అణిచివేసేందుకు ‘సమాధాన్‌’ (SAMADHAN) వ్యూహా న్ని రాజ్‌నాథ్‌ చెప్పారు.

ఎస్‌– స్మార్ట్‌ నాయకత్వం (స్మార్ట్‌ లీడర్‌ షిప్‌ , ఏ– దూకుడైన వ్యూహం (అగ్రెసివ్‌ స్ట్రాటజీ), ఎం–ప్రేరణ, శిక్షణ (మోటివేషన్‌ అండ్‌ ట్రైనింగ్, ఏ–కార్యాచరణలో కనిపించే ఇంటెలిజెన్స్‌ (యాక్షనబుల్‌ ఇంటెలిజెన్స్‌), డీ–డాష్‌బోర్డు ఆధారిత కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌)లు, కేఆర్‌ఏ (కీ రిజల్ట్‌ ఏరియా)లు, హెచ్‌– ఆధునిక సాంకేతికత వినియోగం (హార్నెసింగ్‌ టెక్నాలజీ), ఏ–ప్రతి విభాగానికి ప్రత్యేక కార్యాచరణ (యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ ఈచ్‌ థియేటర్‌), ఎన్‌– ఆర్థిక వనరులు అందకుండా చేయట (నో యాక్సెస్‌ టు ఫైనాన్సింగ్‌)మే సమాధాన్‌ వ్యూహమని వివరించారు.

ఏపీ, తెలంగాణ నుంచి: మావో తీవ్రవాదం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదని, ఇది జాతీయ సమస్యని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీలో గ్రేహౌం డ్స్‌ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చినరాజప్ప కేంద్రాన్ని కోరారు. ఏపీ,తెలంగాణ మధ్య భద్రత విష యంలో సమన్వయ లోపం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. తమకు మరిన్ని బలగాలను కేటా యించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్న డీజీపీ అనురాగ్‌ శర్మ.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ ప్రాంతాల్లో మావో సమస్య ఉందన్నారు. అదనపు బలగాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

నక్సల్స్‌ ఏరివేతకు ఆర్మీ నో!
మావోలతో పోరాడుతున్న సాయుధ బలగాలకోసం ఏర్పాటుచేసే క్యాంపుల్లో అన్ని వసతులూ ఉండాలని రాజ్‌నాథ్‌ ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల మాదిరిగా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ అన్ని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఉండాలన్నారు. కాగా, నక్సల్స్‌ వ్యతిరేక కార్యక్రమాల్లో ఆర్మీని వినియోగించబోమని హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహరిషి చెప్పారు. మావోల ఏరివేతకు 2వేల మంది కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాలో రంగంలోకి దించనున్నట్లు సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమబెంగా ల్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న ఈ కోబ్రాలను సుక్మాకు పంపుతామన్నారు.

మరిన్ని వార్తలు