అనుబంధానికి రక్ష

6 Aug, 2017 22:13 IST|Sakshi
అనుబంధానికి రక్ష

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. తమకు జీవితంలో అన్ని సందర్భాల్లోనూ తోడుండమని కోరుతూ సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడమే ఈ పండుగ. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణిమ రోజున ఈ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకొంటారు. దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుపుకొటున్నట్లు మన పురాణాలు చెబుతన్నాయి. రక్షాబంధన్‌ వెనుక ఉన్న పురాణగాథలు, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం..

శ్రీకృష్ణుడు–ద్రౌపదిల బంధం...
తన సోదరి అయిన ద్రౌపది విషయంలో శ్రీ కృష్ణుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో తెలుసుకుంటే మన సంస్కృతిలో అన్నాచెల్లెల్ల మధ్య బంధం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. కృష్ణుడు శిశుపాలుడిని సుదర్శన చక్రం ప్రయోగించి వధించాడు. ఈ సమయంలో కృష్ణుడి చూపుడు వేలుకు గాయమై, రక్తం ధారగా కారుతుంది. దీంతో ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చించి, అన్నయ్య కృష్ణుడికి కట్టుకట్టి రక్తం కారడం ఆగిపోయేలా చేస్తుంది. దీంతో సంతోషించిన కృష్ణుడు, తన చెల్లికి ఎల్లవేళలా అండగా ఉంటానని అభయమిస్తాడు. చెప్పినట్లుగానే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీ కృష్ణుడు ఆమెకు చీరలు అందించి అండగా నిలిచాడు.

పురుషోత్తముడి కథ..
జగజ్జేతగా మారాలనే తలంపుతో గ్రీకు రాజు అలెగ్జాండర్‌ అనేక దేశాల మీద దండెత్తుతూ ఉంటాడు. ఈ క్రమంలో క్రీస్తూపూర్వం 326లో మనదేశంపైకి కూడా దండెత్తేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చీనాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపైకి దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ఈ తరుణంలో అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.

కర్నావతి చరిత్ర..
మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్‌ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించడంతో చిత్తోర్‌ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి, గుజరాత్‌ రాజు అయిన సుల్తాన్‌ బహదూర్‌ షా నుంచి హాని ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్‌ ఆమెను సోదరిగా అంగీకరించి కర్నావతి రక్షణకు అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది.

పండుగ విశిష్టత..
రాఖీ పండుగ వెనుక చారిత్రక నేపథ్యాలు ఏవైనా ఇది సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలనే సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తోంది. ఒకప్పుడు ఈ వేడుకను ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తమైంది. ఈ పండుగ రోజున మహిళలు ఎక్కడ ఉన్నా తమ సోదరుల దగ్గరికి వెళ్లి రాఖీ కడుతుంటారు. రాఖీలు కట్టి, తమ సోదరులకు స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు మంచి కానుకలు అందజేస్తారు. పండుగ సందర్భంగా మార్కెట్లు రాఖీ విక్రయాలతో కళకళలాడుతుంటాయి. భిన్నమైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి.

వేర్వేరు ప్రాంతాల్లో..
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్‌ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు.
                                                                                                                     – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

మరిన్ని వార్తలు