20 ఇచ్చినా చాలు!

29 Jul, 2014 23:02 IST|Sakshi

అసెంబ్లీ సీట్లపై తగ్గిన ఆర్పీఐ

ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు 47 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆఠవలె) వెనక్కు తగ్గింది. కనీసం 20 సీట్లు కేటాయించాలని భాగస్వామ్య పక్షాలను కోరింది. ఈ విషయమై ఆర్పీఐ నేత రాందాస్ ఆఠవలె మాట్లాడుతూ... ‘మా పార్టీకి 47 స్థానాలు కేటాయించాలని ముంబైలో సోమవారం జరిగిన మహాకూటమి సమావేశంలో డిమాండ్ చేశాం. అయితే భాగస్వామ్య పార్టీలను కూడా దృష్టిలో ఉంచుకొని కనీసం 20 కేటాయించాలని కోరుతున్నాం.
 
ఇందులో విదర్భ ప్రాంతంలోని 13 సీట్లను ఆర్పీఐకి కేటాయించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. 20 స్థానాలను ఆర్పీఐకి కేటాయించినా కూడా శివసేన, బీజేపీలు తమ స్థానాల్లో కొన్నింటిని మాకోసం త్యాగం చేయక తప్పదు. సీట్ల కేటాయింపుపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గవర్నర్ పదవితోపాటు ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని, త్వరలో ఏర్పాటు కానున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో 15 శాతం అధికారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ పదవిని కూడా దళితులకు ఇవ్వాలని కోరతున్నామ’న్నారు.

మరిన్ని వార్తలు