గాలుల బీభత్సం నుంచి తేరుకోని ఢిల్లీ

1 Jun, 2014 02:13 IST|Sakshi
గాలుల బీభత్సం నుంచి తేరుకోని ఢిల్లీ

యూపీ, జార్ఖండ్, బెంగాల్‌లలో ఈదురుగాలులు.. పదుల సంఖ్యలో మృతి
 
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీ ఈదురు గాలులు సృష్టించిన బీభత్సం నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేదు. తెగిన విద్యుత్ లైన్లు, కూలిన చెట్లు, ఆగిన విద్యుత్, నీటి సరఫరాతో నగరం అస్తవ్యస్తమైంది. విపత్తు ముగిసి 24 గంటలు గడిచినా విద్యుత్, తాగునీరు సరఫరా కాకపోవడంతో శనివారం ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ద్వారక, రోహిణి, పశ్చిమ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కరెంటు లేకపోవడంతో నీటి ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో తాగునీరు సరఫరా కాలేదు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. చాలా ప్రాంతాల్లో బస్సులు నడవలేదు.

ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేసేందుకు వచ్చిన సంబంధిత శాఖల సిబ్బందిపై దాడి చేశారు. పెనుగాలుల ధాటికి చెట్లు, గోడలు కూలడం తదితర ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య  శనివారానికి 14కు చేరింది. మరోపక్క.. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో ఈదురుగాలులు, వర్ష బీభత్సానికి 14 మంది అసువులు బాశారు. శనివారం జార్ఖండ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వల్ల ఏడుగురు చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో పిడుగులు పడి 10 మంది చనిపోగా, 28 మంది గాయపడ్డారు.
 
 

మరిన్ని వార్తలు