‘ఆర్కేనగర్‌’ ఉత్కంఠ

23 Dec, 2017 21:44 IST|Sakshi

నేడే ఓట్ల లెక్కింపు

మరికొన్ని గంటల్లో ఫలితాలు

ఆర్కేనగర్‌ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది.

ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్‌ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్‌ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్‌ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్‌ లైట్స్‌లోని క్వీన్‌ మేరిస్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్‌లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్‌ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్‌ టెలికాస్టింగ్‌ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్‌లోని కంట్రోల్‌ రూమ్‌ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు.

19 రౌండ్లుగా లెక్కింపు
ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్‌ బూత్‌ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్‌ బూత్‌లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్‌ కమిషన్‌ కార్తికేయన్‌ తెలిపారు. కౌంటింగ్‌ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్‌ నాయర్‌ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్‌ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది.

మరిన్ని వార్తలు