బీజేపీతో సచిన్‌ పైలట్‌ మంతనాలు

12 Jul, 2020 14:05 IST|Sakshi

19 మంది ఎమ్మెల్యేల మద్దతు

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో మూడు నెలల కిందట జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు మరువకముందే ఇప్పుడు రాజస్ధాన్‌లో ఆయన బాటలో మరో సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ సాగుతున్నారు. అశోక్‌ గెహ్లోత్‌తో సరిపడని సచిన్‌ పైలట్‌ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. తనకు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. గత మూడు నెలలుగా బీజేపీ శిబిరంతో సచిన్‌ పైలట్‌ వర్గం మంతనాలు జరుపుతోంది. కాగా రాజస్ధాన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు సాగించామనే ఆరోపణలతో స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ తనను ప్రశ్నించడంపై సచిన్‌ పైలట్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిత్వ శాఖను గెహ్లోత్‌ పర్యవేక్షిస్తున్నారు. కాగా సచిన్‌ పైలట్‌ ప్రస్తుతం తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారని, ఈ వ్యవహారంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

కాగా సచిన్‌ పైలట్‌కు సీఎం పదవిని ఆఫర్‌ చేసినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్‌లో విభేదాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించింది. మరోవైపు సచిన్‌ పైలట్‌ను ప్రశ్నించేందుకు సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్‌ అధినాయకత్వం విస్మయం వ్యక్తం చేసింది. సచిన్‌ పైలట్‌కు నచ్చచెప్పేందుకు పార్టీ అధిష్టానం చివరినిమిషం వరకూ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర చీఫ్‌, ఉప ముఖ్యమంత్రిని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం​ ఏమిటని సచిన్‌ పైలట్‌ వర్గీయులు మండిపడుతున్నారు. 2018లో జరిగిన రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి పదవికి సచిన్‌ పైలట్‌ పోటీపడగా పార్టీ అధిష్టానం సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌వైపు మొగ్గుచూపింది. సచిన్‌ పైలట్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. మరోవైపు తన సర్కార్‌ను అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆరోపించారు.

చదవండి : 'నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు'

మరిన్ని వార్తలు