అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు పూర్తి

18 Sep, 2019 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై అక్టోబర్‌ 18 నాటికి అన్ని పార్టీలు తమ వాదనలను ముగించాలని, అవసరమైతే ఆదివారాలతో పాటు ప్రతి రోజు ఒక గంట అదనంగా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. మందిర వివాదంపై మధ్యవర్తిత్వానికి సంబంధించి కోర్టుకు ప్రతిపాదన లేఖ వచ్చిందని, పరస్పరం చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఆయా పార్టీలు ముందుకువస్తే తమకు తెలియచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. ఆయా పార్టీలు అంగీకరిస్తే విచారణతో పాటు మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా సాగుతుందని వెల్లడించింది.

ఆగస్ట్‌ 6న మొదలైన విచారణ ప్రక్రియ బుధవారం 26వ రోజు కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నవంబర్‌ 17న పదవీవిరమణ చేస్తున్న క్రమంలో అక్టోబర్‌ 18 నాటికి తుది వాదనలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. వాదనలు ముగిసిన తర్వాత అయోధ్య వ్యవహారంపై తుది తీర్పు వెల్లడించేందుకు అప్పటికి ఆయనకు ఇంకా నాలుగు వారాల సమయం ఉంటుంది. కాగా తమ తుది వాదనలు వినిపించేందుకు తేదీలను ఖరారు చేసుకోవాలని ఈ అంశాన్ని విచారిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాం‍గధర్మాసనం మంగళవారం సంబంధిత పార్టీలను కోరింది. కాగా అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్ని వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లల్లాల మధ్య సమంగా పంచాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ 14 అప్పీళ్లు సర్వోన్నత న్యాయస్ధానంలో దాఖలయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు