19 వరకూ గృహనిర్బంధం

18 Sep, 2018 02:06 IST|Sakshi

హక్కుల కార్యకర్తల కేసు

న్యూఢిల్లీ: కోరెగావ్‌–భీమా అల్లర్ల కేసులో ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సెప్టెంబర్‌ 19 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్న ఆధారాల్ని పరిశీలించాల్సిన అవసరముందని, ఆ ఆధారాలు కల్పితమని కనుగొంటే సిట్‌ విచారణకు ఆదేశిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘ఆరోపణల ఆధారంగానే ప్రతీ నేర దర్యాప్తు సాగుతుంది.

తగినన్ని ఆధారాలు ఉన్నాయా లేదా అని మనం చూడాల్సి ఉంది. మహారాష్ట్ర పోలీసుల వాదన వినకుండా, ఆధారాల్ని పరిశీలించకుండా.. స్వతంత్ర దర్యాప్తుపై ఎలా నిర్ణయం తీసుకుంటాం. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల్ని మేం చూడాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గత నెల్లో మహారాష్ట్రకు చెందిన పుణే పోలీసులు హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతమ్‌ నవలఖాల్ని అరెస్టు చేయగా.. వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు