కుదుటపడుతున్న ఢిల్లీ

2 Mar, 2020 06:14 IST|Sakshi

న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు.   ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్‌ నగర్‌–తిలక్‌ నగర్‌ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్‌ పురోహిత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు